ఇదేమి చిత్రం! కలిసుండటానికి ఉద్యమమా?
బలవంతంగా కలిసుండాలంటే యాసిడ్ దాడిలాంటిదే : కోదండరామ్
ఆదిలాబాద్, ఆగస్టు 11 (జనంసాక్షి) :
రాష్ట్రం కలిసుండటానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమిటని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇదేమి విచిత్రమో కాని సీమాంధ్ర ప్రాంత నేతల బహు విచిత్రంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలు విడిపోతామో మోర్రో అంటుంటే బలవంతంగా కలిసుందామని సీమాంధ్రులు అనడం ప్రేమ పేరుతో వెంటపడి వేధించి యాసిడ్ దాడి చేయడం లాంటిదేనని అభివర్ణించారు. ఆరు దశాబ్దాల దోపిడీని కొనసాగించేందుకు సీమాంధ్రులు సమైక్య రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యంగా ఉండాలని ఆ ఒక్క ప్రాంత కోరుకుంటే సరిపోదని, తెలంగాణ ప్రజలకూ కలిసి ఉండాలని లేనప్పుడు బలవంతపు కాపురం, బలవంతపు ప్రేమ ఫలితాన్ని ఇవ్వబోమని స్పష్టం చేశారు. సీమాంధ్రుల ప్రవర్తన యువతులపై చేస్తున్న యాసిడ్ దాడులను తలపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల పోరాటం ఫలితంగా కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర పెత్తందారులు, దోపిడీదారులు ఎలాగైనా తెలంగాణను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా చిత్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తీరుతామని స్పష్టం చేశారు. మన కల సాకరమయ్యే వేళ ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కోరారు.