కోన్‌ కిస్కా గొట్టం లగడపాటి ఎవరు.. తెలంగాణపై మాట్లాడటానికి?


సీడబ్ల్యూసీదే తుది నిర్ణయం
సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెతో సాధించలేరు.. విరమించుకోండి : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) :
తెలంగాణపై మాట్లాడటానికి లడగపాటి రాజగోపాల్‌ ఎవరని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రశ్నించారు. లగడపాటి ఓ కోన్‌ కిస్కా గొట్టం అనే తరహాలో ఆయన అభివర్ణించారు. తెలంగాణపై రాజ్యసభలో నిర్వహించిన చర్చ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ సమైక్యానికి కట్టుబడి ఉండేటట్లు కృషి చేస్తానన్న లగడపాటి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆయన సీడబ్ల్యూసీ కంటే ఉన్నతుడేమి కాదని, అసలు ఆయన మాటాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. లగడపాటే కాదు సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఈ విషయమై మీడియాకు ఎక్కడం మానుకోవాలని హితవు పలికారు. సీమాంధ్ర ప్రజలను అనవసరంగా రెచ్చగొట్టవద్దని సూచించారు. రాష్ట్ర విభజనపై ఏమైనా అపోహలుంటే ఆంటోని కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు విరమించుకోవాలని దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న డిమాండ్‌తో సోమవారం అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె వల్ల వాళ్లు సాధించేదేవిూ లేదని తేల్చి చెప్పారు. ఆందోళనలతో సమస్యలు ఇంకా జఠిలమవుతాయి తప్ప పరిష్కారం కావని అన్నారు. తెలంగాణ అంశంపై భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ వాస్తవాల ఆధారంగా మాట్లాడరని ఆరోపించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘నవభారత యువభేరి’ సభలో తెలంగాణ అంశంపై గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమన్నారు. మోడీ ఎప్పుడూ వాస్తవాల ఆధారంగా మాట్లాడరని ఎద్దేవా చేశారు. యువభేరి సభలో ఆయన కాంగ్రెస్‌ పార్టీపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తెలిపారు. హైదరాబాద్‌ సభలో 60 అబద్దాలు చెప్పారని, ఆయన వ్యాఖ్యల్లో కొత్తదనమేమీ లేదన్నారు. 2001లో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తే మీరేం చేశారని, ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము తెలంగాణకు అనుకూలమని బీజేపీ పదే పదే చెబుతోందని.. కానీ గతంలో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని ఎంపీ నరేంద్ర కలిసినప్పుడు తెలంగాణ ప్రసక్తే రాలేదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ కొంతకాలం తర్వాత తెలంగాణకు అనుకూలమని చెప్పారన్నారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ కాంగ్రెస్‌ను విమర్శించడం అనైతికమని మండిపడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులు చేపట్టిన సమ్మెను విరమించుకోవాలని దిగ్విజయ్‌ కోరారు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలేమైనా ఉంటే, ఆంటోనీ కమిటీకి చెప్పుకోవచ్చని భరోసానిచ్చారు. సమ్మెల వల్ల వచ్చేదేవిూ ఉండదని, చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపారు. చర్చల ద్వారానే ఏదైనా సాధ్యమని చెప్పారు. సమ్మెల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు. ఉద్యుగులందరూ విధులకు హాజరై సామన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఏపీ ఎన్జీవోలను చర్చల కోసం ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెప్పారు. సోమవారం గానీ, మంగళవారం రాత్రి గానీ వారితో చర్చిస్తామని వివరించారు.