బయటపడ్డ పార్టీల రంగు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల అసలు రంగును బయటపెట్టాయి. తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన సుదీర్ఘ చర్చలో అన్ని పార్టీలు తమ అభిమతాన్ని వెల్లడించాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ వేదికగా తన అవకాశవాద నైజాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో తీర్మానం చేసి 1999 ఎన్నికల్లో లబ్ధిపొందిన బీజేపీ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నా తెలంగాణను మాత్రం పట్టించుకోలేదు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా గతంలో పార్టీ తీర్మానించిన తెలంగాణ అంశాన్ని అటకెక్కించింది. అందుకు కారణం అప్పటి లోక్‌సభలో టీడీపీకి ఉన్న 29 మంది ఎంపీల బలమే. ఎన్‌డీఏలో రెండో అతిపెద్ద పార్టీ కన్నెర్ర జేస్తే తమ సర్కారు కూలిపోతుందని లెక్కకట్టుకొని మరీ బీజేపీ తెలంగాణను పక్కనబెట్టింది. అంతటితో ఆగలేదు. సికింద్రాబాద్ పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత, అప్పటి ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అందరి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు కొత్త రాష్ట్రాలు గతంలోని రాష్ట్రాల రాజధానులకు బహుదూరంలో ఉన్నాయి కాబట్టి పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా విభజించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదని కొత్త భాష్యం చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి, తన సామాజిక వర్గానికే చెందిన చంద్రబాబుతో బీజేపీపై ఒత్తిడి చేయించింది వెంకయ్యనాయుడేననే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. వాటికి ఇంతవరకు సమాధానమివ్వని వెంకయ్య సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో తన సమైక్య ఎజెండాను స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రమాదకర ఆట ఆడుతోందని, రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమన్నట్టుగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కనీసం ముఖ్యమంత్రి, మంత్రుల అభిప్రాయం కూడా తీసుకోకుండా విభజన ప్రక్రియకు పూనుకుంటారా అంటూ సీమాంధ్ర పక్షపాతిలా మాట్లాడారు. కాంగ్రెస్ తీసుకున్న చర్యలతో సీమాంధ్ర ప్రాంతం ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా తాము మద్దతు తెలుపబోమన్నారు. ఆంటోని కమిటీ వల్ల ప్రయోజనాలేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీమాంధ్ర ప్రాంత జేఏసీ ప్రతినిధిలా వ్యవహరించారు. విభజనపై నిర్ణయం తీసుకోవడానికి 2004 నుంచి 2013 వరకు ఏం చేసిందని ప్రశ్నించారు. సరిగ్గా ఒక్కరోజు ముందు ఎల్‌బీ స్టేడియం వేదిక నిర్వహించిన నవ భారత యువభేరి సభలో బీజేపీ ప్రచార సారథి నరేంద్రమోడీ ఇంచుమించు సమైక్య రాష్ట్రం కొనసాగించాలి అనే సంకేతాలే ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో ప్రస్తుత అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, ఇరు ప్రాంతాల మధ్య విద్వేశాలు రగిలాయని మోడీ చెప్పాడు. తద్వారా సమైక్యాంధ్ర కొనసాగించి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేవి కావనేవి అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ హామీని విస్మరించి మోడీ నవభారత యువభేరి వేదికగా సమైక్య జెండా అందుకున్నారు. తద్వారా ఇంతకాలం తాము ఇచ్చినవన్నీ ఉత్తుత్తి హామీలేనని తేల్చేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందనే అక్కసు, ఈ అంశం ద్వారా ఆ పార్టీ లబ్ధిపొందుతుందేమోననే బాధ ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. తద్వారా తెలంగాణపై బీజేపీ యూటర్న్ తీసుకున్నదనే విషయం స్పష్టమైంది. నాడు అద్వానీ ఎలా మాట్లాడారో.. ఇప్పుడు మోడీ అలాగే, అంతకు ఇంకో అడుగు ముందుకేసే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు యూపీఏ-2 ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ప్రకటించగా, చంద్రబాబునాయుడు మరుసటి రోజే అడ్డం తిరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డు తగిలాడు. అందుకు పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకున్న నేపథ్యంలో ప్రజల్లో మళ్లీ స్థానం సంపాదించుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు తెలంగాణపై ఓ లేఖను అందజేశారు. ముందైతే లేఖ ఇచ్చాడు కానీ తెలంగాణ ఏర్పడకుండా చంద్రబాబు తెరవెనుక చాలా ప్రయత్నాలే చేశాడు. ఈ విషయాన్ని ఇటీవల జాతీయ మీడియ బయటపెట్టింది. తెలంగాణ ఏర్పాటుపై అనుకూల లేఖ ఇచ్చి సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులతో లోక్‌సభ, రాజ్యసభల్లో అనవసర గందరగోళం సృష్టింపజేస్తున్నాడు. తెలంగాణపై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, హరికృష్ణ సమైక్యరాష్ట్రమే కొనసాగించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు. చట్టసభలో తాము తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోగలిగామని సీమాంధ్ర ప్రజల్లో చెప్పుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను ఈ ముగ్గురు అనుసరించారు. హరికృష్ణ చట్టసభల నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. ఇటీవలే తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉండాల్సిందేనన్న హరికృష్ణ మళ్లీ సమైక్యవాదం ఎంతుకు అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇరు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెట్టిందని, ఇందుకు వైఎస్ కారణమని సీఎం రమేశ్ అనగా, వైఎస్‌ను వెనకేసుకొచ్చేందుకు ఆయన సన్నిహితుడు కారగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రయత్నించాడు. తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీపీఎం అదే వైఖరి ప్రదర్శించగా, సీపీఐ ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణమంది. త్వరగా తెలంగాణపై తేల్చాలని కోరింది. సమాజ్‌వాదీ తెలంగాణ వద్దే వద్దనగా, బీఎస్పీ మాత్రం తెలంగాణ ఇచ్చేయాలని కోరింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుకూలమని చెప్పింది. మొత్తానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ఇక్కడ రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడుతున్న బీజేపీ తెలంగాణకు వ్యతిరేక వైఖరినే ప్రదర్శించాయి. వైకాపా ఇప్పటికే సమైక్య జెండాతో సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమైన విషయం తెలిసిందే. తెలంగాణపై ఇంతకాలం కళ్లబొల్లి కబుర్లు చెప్పిన రాజకీయ పార్టీలు చట్టసభల వేదికగా తమ అసలు రంగును మాత్రం బట్టబయలు చేశాయి.