దగా, మోసం తెలుగుజాతి విచ్ఛిన్నం కావడమా?


గుండెలు బాదుకున్న చంద్రబాబు
హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా
సమన్యాయం జరుగలేదు
విభజనకు అనుకూలమంటూనే సమైక్య నొక్కులు
హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) :
స్వాతంత్రం వచ్చేనాటికే దేశంలో అభివృద్ధి చెందిన ఐదో నగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అలవాటే. అలవాటురీత్యా సీమాంధ్ర బాబు మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ హైదరాబాద్‌ అభివృద్ధిపై అవే అవాకులు చెవాకులు పేలాడు. గొర్రె వెంట్రుకలన్నీ కత్తిరించి గొంగడి చేసుకొని వెచ్చదనాన్ని పొందే పెత్తందారు తన గొంగడి బొచ్చే మీకిచ్చి (గొర్రెల చర్మంపై పెట్టి) వెచ్చదనాన్ని ఇస్తున్నానని బుకాయిస్తాడట. అలాగే హైదరాబాద్‌కు వచ్చాక కోట్లకు పడగలెత్తిన వారిలో ప్రముఖుడు చంద్రబాబు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు గతం ఎవరికీ తెలియంది కాదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు సమకూర్చుకున్న ఆస్తులన్నీ తెలంగాణ ప్రజల, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రజల నోటికాడి బుక్క లాక్కొని సంపాదించుకున్నవే. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ అభివృద్ధిపై చేస్తున్నది ముమ్మాటికీ అబద్ధపు ప్రచారమే. రాష్ట్ర ఖజానాలో హైదరాబాద్‌ నగర ఆదాయం వాటా దాదాపు 50 శాతం. దేశంలో మెట్రో నగరాలన్నింటినీ ఆదాయం ఆయా నగరాల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నారు. అలాంటిది హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఆదాయంలో భిక్షం వేసినట్లు కొంత ఖర్చు చేసి నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించాడు. హైదరాబాద్‌ భూములను వివిధ పేర్లతో కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాడు. ఆయన విలేకరులతో మాట్లాడిన మాటలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తి పోస్తూ హైదరాబాద్‌ను వీడలేమంటూ సన్నాయి నొక్కాలు నొక్కాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అనేక తప్పులు చేస్తూనే పోతుందని, దీనికి కేవలం టీడీపీని టార్గెట్‌ చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ విధానాలన్నీ రాజకీయ లబ్ధికోసమేనని ఆరోపించారు. తెలంగాణాకు తాము మద్దతిస్తున్నామని చెప్పినా కూడా టీఆర్‌ఎస్‌ కలుస్తుందని చెప్పడం దుర్మార్గం కాదా అన్నారు. టీడీపీ వెనక్కి పోయినా సరే కాంగ్రెస్‌ వెనక్కి పోదని చెప్పడం దుర్మార్గం కాదా అన్నారు. ప్రారంభించింది మేమే పూర్తి చేసేది మేమే అని చెప్పుకోవడం అవివేకం కాదా అన్నారు. రాజ్యసభలో అన్ని పార్టీలు ఇదే విధంగా ప్రశ్నించారని గుర్తు చేశారు. విభజన సమయంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ పోవడం వల్ల సమస్య పెరిగిపోతుందన్నారు. అందరిని కూర్చోపెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటారా అనే అంశంపై స్పందిస్తూ ఈ తరుణంలో అది ప్రాధానం కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేయాల్సిన పరిస్థితి లేకుండా పోవడంతో తాను డిబెట్‌ చేయాలనుకుంటున్నానన్నారు. గతంలో తెలుగువారికి లభించిన గౌరవం నేడు లేకుండా పోయిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌, నేను కూడా జాతీయ పార్టీలను కూర్చోపెట్టి సమస్యను పరిష్కరించిన దాఖలాలున్నాయన్నారు. నేడు మిగతా వారితో చెప్పించుకునే పరిస్థితికి దిగజారడం దుర్మార్గమని, ఇది తెలుగుజాతికి అవమానమన్నారు. ఇప్పటికైనా రెండు ప్రాంతాల వారికి న్యాయం చేసేందుకు కృషిచేయాల్సింది పోయి రోజురోజుకు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాను చేపట్టనున్న కార్యక్రమాన్ని ఏం చేయాలనేది చూస్తున్నట్లు ప్రకటించారు. సున్నిత మైన అంశంపై రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం శోచనీయమన్నారు. విభజన తీరును ఖండిస్తున్నానన్నారు. విభజనకు వ్యతిరేకం కానే కాదన్నారు. 1984 నుంచి నేటివరకు కూడా కాంగ్రెస్‌ అవలంబిస్తున్న తీరును పరిశీలిస్తే కేవలం కాంగ్రెస్‌ లబ్ధి కోసం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని సోనియా చెప్పారు. తెలంగాణ ఇస్తామని ముందుకు పోయారు. 2009లో ఎన్నికలకు ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టలేదు గాని అభ్యంతరం లేదని చెప్పిందని గుర్తు చేశారు. ఆంటోని కమిటీ కాకుండా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తే అన్ని పార్టీలు కలిసే అవకాశం ఉందన్నారు. అది కాంగ్రెస్‌ పార్టీ కమిటి మాత్రమేనన్నారు. వైఎస్‌ ప్రారంభించినదాన్ని తాము పూర్తి చేశామని దిగ్విజయ్‌ చెప్పడం చూస్తే ఇచ్చింది, తెచ్చింది మేమే అని క్రెడిట్‌ సంపాదించుకోవాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ముందు చేతులు కట్టుకుని నేనేందుకు నిలుచుంటానని కొట్టి పారేశారు. ఆ కమిటీ కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరిస్తే చాలన్నారు. తల్లి ,పిల్ల కాంగ్రెస్‌ల విమర్శలను పట్టించుకోబోమన్నారు. త్వరలోనే తాను అందరితో కలిసి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తానన్నారు. విస్తృత ప్రయోజనాలకోసం ఆలోచించే వారితో తాను చర్చలు జరుపుతానన్నారు. అందరికి న్యాయం జరిగేందుకు ప్రయత్నిస్తానన్నారు. క్రెడిట్‌ వారే తీసుకోవచ్చని పేర్కొన్నారు. అందరు చెప్పింది వింటాను, తర్వాత తాను చేసేది కూడా వారితో చర్చిస్తానన్నారు. 80వేల కోట్ల రూపాయలు నీటి పారుదలపై వెచ్చించి దుర్వినియోగం చేశాయన్నారు. రాజ్యసభలో రాష్టాన్రికి సంబందం లేని వారు సైతం తెలంగాణా ఏర్పాటు తీరుపై విమర్శించే స్థాయికి కాంగ్రెస్‌ తెచ్చుకుందని ఆరోపించారు. రాజ్యసభలో చిదంబరం తీరు పూర్తిగా ఆక్షేపణీయమన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని అయిదవ ప్రకరణ ప్రకారం రాష్టాన్న్రి విభజించామని చెప్పిన చిదంబరం అసెంబ్లీలో, పార్లమెంట్‌లో చర్చించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనకు ఎక్కవగా బాధేస్తున్నాయన్నారు. విదేశాల్లో వీధి వీధి తిరిగి సంస్థలను తీసుకు వచ్చానన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఏఒక్కరి ప్రమేయం లేనే లేదన్నారు. ఆనాడు తాను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆనాడు తన స్వార్థం కోసం ఆలోచించి ఉంటే పుట్టిన ఊరిలోనో, తిరుపతిలోనే అభివృద్ధి చేసుకుని ఉండేవాడినన్నారు. అందరికి ఉపయోగంగా ఉండాలనే ప్రయత్నించానన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి ఎంతమంది చుట్టూ తిరిగానో కాంగ్రెస్‌ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. డిఫెన్స్‌ అకాడమి వాళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా అధికారులను మెప్పించి శంషాబాద్‌ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశానన్నారు. దేశ రాజధానిలో ఉండాల్సిన ఇన్సురెన్స్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను హైదరాబాద్‌లో పెట్టించానన్నారు. ఫార్మా రెగ్యులేటరీని హైదరాబాద్‌కు తీసుకువచ్చానన్నారు. బిట్స్‌ పిలాని, ఐఐటీలాంటి సంస్థలు, ఎన్నో తీసుకు రావడం జరిగిందన్నారు. అయినా తాను ఆ విషయాల జోలికి పోదల్చుకోలేదన్నారు. కేవలం ఇరుప్రాంతాల నేతలకు న్యాయం చేసే కార్యక్రమాలను మాత్రమే చేపట్టాలని కోరుతున్నట్లు బాబు ప్రకటించారు. బీజేపీతో పొత్తుల విశయం అప్రస్తుతమన్నారు. రాష్ట్రంలో తెలుగు వారు తన్నుకు చస్తుంటే లబ్ధికోసం ఉపయోగపడే అంశాలను చర్చించ దలుచుకోలేదన్నారు. వాటికింకా సమయం ఉందన్నారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయాలనేదే తన డిమాండ్‌ అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. సీమాంధ్రలో కొత్త రాజధానికోసం 4, 5లక్షల కోట్లు కావాలంటే అంత అవసరం లేదని దిగ్విజయ్‌ సింగ్‌ ఎగతాలిగా మాట్లాడడం దుర్మార్గంగా ఉందన్నారు. కేవలం నాలుగు భవనాలు కట్టుకుంటే రాజధాని అవుతుందా అన్నారు. హైదరాబాద్‌కు సమానంగా సంస్థలు, కార్యాలయాలు, రావాల్సిన అవసరం ఉందా లేదా అని నిలదీశారు. ఓవైపు తెలంగాణా ఇచ్చినందుకు టిఆర్‌ఎస్‌ను, మరోవైపు జగన్‌ను రెచ్చగొట్టి ఎన్నికల ముందో, తర్వాతో వైఎస్సార్‌సిపిని కలుపుకుని రెండు ప్రాంతాల్లో అధికారంలో ఉండాలనుకోవడం నీతి బాహ్యమైన చర్యగా పేర్కొన్నారు.