ఉభయ సభల్లోనూ ‘వాద్రా’ రగడ


న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూకుంభకోణం వ్యవహారం మంగళవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వం వాద్రాను రక్షిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఉభయ సభల్లో ఆందోళనకు దిగింది. వాద్రా భూ కుంభకోణాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారించాలని డిమాండ్‌ చేసింది. దీనిపై తక్షణమే ప్రకటన చేయాలని పట్టుబట్టింది. వాద్రా కుంభకోణంపై విపక్షాలు నిలదీయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం ప్రారంభం కాగానే వాద్రా కుంభకోణంపై ఖేమ్కా రిపోర్టుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి. నినాదాలు, నిరసనల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌నేత యశ్వంత్‌ సిన్హా జోక్యం చేసుకుంటూ, సభను సజావుగా నడపాలని కోరారు. వాద్రా వ్యవహారంపై సిట్‌ విచారణకు ఆదేశించాలని కోరారు. ‘వ్యాపారాలు ఎలా చేయాలి? లాభాలు ఎలా పొందాలో నేర్పేందుకు అనేక బిజినెస్‌ స్కూళ్లు ఉన్నాయి. కానీ, దేశంలోని అత్యున్నత కుటుంబంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బిజినెస్‌ స్కూళ్లకు వెళ్లకుండా మంచి వ్యాపార లక్షణాలు వంటబట్టించుకున్నారు. పెట్టబడులు లేకుండా వందల కోట్లు సంపాదించాలో నేర్చుకున్నారు’ అని వాద్రాపై మండిపడ్డారు. ఆయనను చూసి ఆర్థిక మంత్రి చిదంబరం కొన్ని చిట్కాలు నేర్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించారని ధ్వజమెత్తారు. అయితే, ఒకవైపు విపక్షాల ఆందోళనలు, మరోవైపు, సీమాంధ్ర ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ గంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం అదే పరిస్తితి నెలకొంది. వాద్రా భూముల వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. సభాపతి ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ వెనక్కుతగ్గకపోవడంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. వాద్రా వ్యవహారం అటు రాజ్యసభనూ కుదిపేసింది. మంగళవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఏఐసీసీ అధినేత్రి అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూకుంభకోణం సభలో గందరగోళానికి కారణమైంది. సభ ఉదయం ప్రారంభం కాగానే వాద్ర భూకుంభకోణం వ్యవహారాన్ని బీజేపీ సభ్యులు లేవదీశారు. ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా తన నివేదికలో చేసిన ఆరోపణలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీనికోసం ప్రశ్నత్తరాల సమయాన్ని రద్దు చేయాలని బీజేపీ సభ్యుడు ప్రకాశ్‌ జవదేకర్‌ నోటీసు ఇచ్చారు. అయితే, చర్చకు నిరాకరించిన సభాపతి హమీద్‌ అన్సారీ, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు యత్నించారు. కానీ విపక్ష సభ్యులు వాద్రా వ్యవహారంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ సభను అడ్డుకున్నారు. సభా కార్యకలాపాలను సజావుగా నడవనివ్వాలని అన్సారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. ప్రతి ఒక్క నిబంధనను, ప్రతి సంప్రదాయాన్నీ సభ్యులు ఉల్లంఘిస్తున్నారని, గౌరవనీయులైన సభ్యులు సభను అరాచకాల మయంగా చేయాలనుకుంటే తాను ఏమీ చేయాలేనంటూ తీవ్ర నిస్సహాయతను వ్యక్తం చేస్తూ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. మళ్లీ గందరగోళం నెలకొనడంతో అరగంట పాటు వాయిదా పడింది.