ఆంటోని కమిటీ హైదరాబాద్‌కు రాదు తెలంగాణ ప్రక్రియ ఆగదు


14, 15, 19, 20 తేదీల్లో కమిటీ సమావేశం : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు తలెత్తే సందేహాలను మాత్రం నివృత్తి చేస్తామని చెప్పారు. మంగళవారం వార్‌ రూం భేటీ అనంతరం దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు వల్ల సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన కమిటీ వార్‌రూంలో భేటీ అయింది. ఈ భేటీలో అహ్మద్‌పటేల్‌, వీరప్పమొయిలీ, జ్యోతిరాదిత్య సిందియా, దిగ్విజయ్‌సింగ్‌ పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన అర్థం లేనిదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతం వారికి ఉన్న అభ్యంతరాలు ఆంటోని కమిటీకి చెప్పుకోవచ్చని తెలిపారు. ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ హైదరాబాద్‌కు వెళ్లే అవకాశాలు తక్కువేనని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఆంటోనీ హైదరాబాద్‌కు దాదాపు రాదని తేల్చిచెప్పారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆంటోనీతో భేటీ అయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన రాజకీయ పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగానే తీసుకున్న నిర్ణయమని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చకు వస్తుందని తెలిపారు. బుధ, గురువారాల్లో తర్వాత ఈనెల 19, 20 తేదీల్లో ఆంటోనీ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై అభ్యంతరాలున్నవారంతా పీసీసీ అధ్యక్షుడి ద్వారా కమిటీని సంప్రదించి వివరాలు ఇవ్వాలని కోరారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో ప్రయోజనం ఉండదని, విరమించాలని మరోమారు కోరారు.