మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

చిరునవ్వుల భారతే మా స్వప్నం
ఎంతో చేశాం.. చేయాల్సింది ఇంకెంతో ఉంది
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) :
మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. చిరునవ్వుల భారతాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని వెల్లడించారు. పేదరిక నిర్మూలన, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదలు అర్ధాకలితో అలమటించ కూడదనే ఆహార భద్రత బిల్లును రూపొందించామన్నారు. సరిహద్దు, అంతర్గత భద్రత విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. ప్రపంచంతో పోలిస్తే ఆర్థిక మాంద్యం ప్రభావం మనపై తీవ్రంగా ఉందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఎర్రకోటపై పదో సారి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించారు. ముంబైలో జరిగిన జలాంతర్గామి ఘటనపై చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.దాయాది పాకిస్తాన్‌ను ప్రధాని మన్మోహన్‌ సుతిమెత్తగా హెచ్చరించారు. పాకిస్తాన్‌ తన భూభాగంలో తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని సలాహా ఇచ్చారు. అప్పుడే పాక్‌తో భారత్‌ స్నేహ సంబంధాలు మెరుగు పడతాయని తెలిపారు. భారత సైనికులపై పొరుగు దేశం దుశ్చర్యలు ఎంతో కలిచి వేశాయన్నారు. సరిహద్దు, అంతర్గత భద్రతపై కఠినంగా వ్యవహరిస్తామని మన్మోహన్‌ తెలిపారు.పేదరిక నిర్మూలన, ఉపాధి, విద్య అందించడమే మన లక్ష్యమని చెప్పారు. యువత ఉపాధి కల్పనకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హావిూతో యువతకు ఉపాధి లభిస్తోందన్నారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నామన్నారు. అందరికీ విద్య నినాదంతో విద్యాహక్కు చట్టం తీసుకొచ్చామని వివరించారు. ఉన్నత విద్యాభివృద్ధికి కొత్తగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్ని పథకాలు ప్రారంభించినా ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. 11 కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని పేర్కొన్న మన్మోహన్‌.. మధ్యాహ్న భోజనంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. బీహార్‌ ఘటన మనందరినీ కలిచివేసిందని తెలిపారు. గత రెండేళ్లుగా దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగు పరుస్తున్నామని చెప్పారు. ఉత్తరాఖండ్‌ మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. వృద్ధిరేటు 5 శాతం కన్నా తక్కువగా ఉందని చెప్పారు. ఐరోపా, అమెరికా మాంద్యం మన వృద్ధి రేటును కుంగదీసిందన్నారు. ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శరమిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంస్థరణలు ప్రారంభమైనప్పుడు సమస్యలు వచ్చాయన్నారు. ఆహార భద్రత బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.