మా ఉద్యోగులపై పెండకొడ్తారా?


మీ గుంటూరు పల్లెలపై పల్లెత్తు మాటన్నమా?
సీమాంధ్రుల నీచ సంస్కృతిపై మండిపడ్డ ఈటెల
హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) :
మహిళలను పెండతో కొట్టి అవమానించడమే సీమాంధ్రుల సంస్కృతా అని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలోనూ ఆందోళ్లను, గుంటూరు పల్లెలపై పల్లెత్తు మాటన్నమా అని నిలదీశారు. ఆంధ్రోళ్లను ఏనాడూ తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టలేదన్నారు. గొప్ప సంస్కృతి ఉన్న గడ్డ తెలంగాణ అని అన్నారు. తాము స్నేహహస్తాన్ని చాటుతున్నామన్నారు. ఆంధ్ర బిడ్డలను కడుపులో పెట్టుకుని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోనూ, తాము తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపైగానీ, ప్రజలపైగానీ ఎన్నడూ దాడులు చేయలేదన్నారు. ఆంధ్రోళ్లకు అండగా ఉంటామని మారోమారు చెబుతున్నామన్నారు. రాజ్యసభలో బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు సీమాంధ్రులకు సహకరించారని ఆరోపించారు. పార్లమెంట్‌లో మాకో న్యాయం.. సీమాంధ్రులకు మరో న్యాయమా అని నిలదీశారు. వెంకయ్య చర్చ సందర్భంగా విభజనపై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. సీమాంధ్రులది కృత్రిమ ఉద్యమం కాదా అని ఆయన ప్రశ్నించారు. జై తెలంగాణ అంటూ చంద్రబాబు తెరవెనక కుట్ర చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ విలీనంపై మాట్లాడేందుకు చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నానన్నారు. అలాగే, తెలంగాణ వ్యతిరేక శక్తులపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సచివాలయంలో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులే అధికమన్న వాస్తవాన్ని నేడు ఏపీఎన్జీవోల సంఘం బట్టబయలు చేసిందని అన్నారు. తెలంగాణలో సీమాంధ్ర మంత్రులను తాము కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామన్నారు. తాము స్నేహ హస్తాన్ని అందిస్తుంటే.. సీమాంధ్ర నేతలు భస్మాసుర హస్తాన్ని చాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.