ఆలస్యంగా నిద్రలేచిన సర్కారు


అసంబద్ధ సమ్మెపై ఎస్మా ప్రయోగం
నో వర్క్‌.. నో పే జీవో 177 అమలు
ఆరు నెలల పాటు సమ్మెలు, ర్యాలీలు నిషేధం
హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఉద్యోగుల అసంబద్ధ సమ్మెపై ఎట్టకేలకు సర్కారు చర్యలకు సిద్ధపడింది. ఆలస్యంగా నిద్రలేచిన సర్కారు ఉద్యోగులపై ఎస్మాపై ప్రయోగిం చనన్నుట్టు పేర్కొంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఏపీ ఎన్జీ వోలపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఎస్మా (అత్యవసర సేవల చట్టం) చట్టాన్ని ప్రయోగించింది. బంద్‌లు, సమ్మెలపై ఆరు నెలలపాటు నిషేదం విధించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని గత ఐదు రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావం సీమాంధ్ర ప్రజల సాధారణ ప్రజల జీవనంపై దుష్ప్రభావం చూపుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమై పోయాయి. తిరుమల కొండపైకి కూడా బస్సులు వెళ్లడం లేదు. ప్రైవే టు వాహనాలను కూడా రోడ్లపైకి రానివ్వమంటూ ఏపీ ఎన్జీవోలు ప్రక టించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఎస్మా చట్టం ప్రకారం విధులకు హాజరైతేనే వేతనం వస్తుంది. విధులకు హాజరు కాని ఉద్యోగులకు జీతం రాదు. సమ్మెలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇదివరకే 238 జీవో చేసింది.
పని చేయకపోతే జీతం లేదు
సమైకాంధ్ర ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 177ని ప్రయోగించింది. దీని ప్రకారం నో వర్క్‌ నో పే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు చోటు లేదని, ఎలాంటి ఆందోళనకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సచివాలయం, కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఒక సర్క్యులర్‌ ద్వారా వివరించింది. జీవో 177 ప్రకారం కేవలం విధులు నిర్వర్తించిన వారికే వేతనం ఇస్తామని తెలియజేసింది. కార్యాలయాలకు వచ్చి సంతకం పెట్టి పని చేయకుండా వుండే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అలాగే ఆరు నెలల పాటు సమ్మెలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్టు పేర్కొంది.