తెలంగాణపై సోనియా ఉడుం పట్టు


2004 ఎన్నికల సభల్లో మాటిచ్చా
శాశ్వత ఉమ్మడి రాజధాని కుదరదు
సీమాంధ్రకు ప్యాకేజీ, రాయితీలే
పునరాలోచన ప్రకస్తే లేదు
చిరంజీవి, ఉండవెల్లికి మొట్టికాయలు
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఉడుం పట్టు పట్టారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తీరాలని భీష్మించుకు కూర్చున్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో నిర్వహించిన ప్రచార సభల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చానని, ఇప్పుడు ఆ హామీ అమలు చేయబోతున్నాని తనను కలిసిన సీమాంధ్ర నేతలు చిరంజీవి, ఉండవెల్లి అరుణ్‌కుమార్‌కు తేల్చిచెప్పారు. హైదారాబాద్‌లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో జీవనం సాగిస్తున్నారని, ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేస్తే వారి భద్రత పరిస్థితి ఏమిటని వారు సోనియాకు మొర పెట్టుకున్నారు. హైదారబాద్‌ను కేంద్ర పాలితప్రాంతంగా గానీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా గానీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి మాటలు సావధానంగా విన్న సోనియాగాంధీ ఇద్దరిపై మండిపడ్డారు. ఇంతకాలం హైదరాబాద్‌పై మీరు చెప్తున్న మాటలు ఏంటి? ఇప్పుడు మాట్లాడుతున్న ఏమిటీ అని మొట్టికాయలు వేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని, ఇక వెనక్కు తగ్గే పరిస్థితే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఇచ్చి తీరుతామని సోనియా ఖరాఖండిగా చెప్పడంతో చిరంజీవి, ఉండవెల్లి హైదరాబాద్‌లో ప్రజల భద్రతపై మరోమారు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇంతకాలం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టామని, ఇప్పటికిప్పుడు కొత్త రాజధాని నిర్మించుకోవడం కష్టమన్న వారి వాదనతో సోనియా విభేదించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినట్లుగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని చెప్పారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇస్తామని, కొత్త రాజధాని ఏర్పాటు చేసే వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారు. మొదట పది వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పిటనట్లుగా తెలిసింది. సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఐటీ అభివృద్ధి పన్ను రాయితీలు కూడా ఇస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మిగతా ప్రాంతాల వారు జీవనం సాగిస్తున్నట్లుగానే సీమాంధ్రులు కూడా బతకొచ్చని అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పునరాలోచన ప్రసక్తే లేదన్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతి ఒక్కరు గౌరవించాలని సోనియా సూచించారు. సీమాంధ్ర ప్రాంతంలో అనవసర ఆందోళనలతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆమె హితవు పలికారు.