తెలంగాణపై నిర్ణయమైపోయింది

కిరణ్‌ను తలంటిన ఆంటోనీ కమిటీ
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మంగళవారం రాత్రి ఆంటోని కమిటి నుంచి గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా మంగళవారం ఢిల్లీ చేరుకున్న సిఎం కిరణ్‌ ముందుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ను కలుసుకున్నారు. రాత్రి 8 గంటలకు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంటోని కమిటీని కలుసుకోవలసి వెళ్లారు. రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తూ దాదాపు 40 నిమిషాల పాటు సిఎం తన వాదన వినిపించారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాలు, రెవెన్యూ, విద్యుత్‌ వంటివి రెండు ప్రాంతాలకు న్యాయబద్ధంగా ఎలా పంచుతారని ఆయన కమిటీ సభ్యులైన, ఆంటోని, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌ సింగ్‌, ఆహ్మద్‌ పటేల్‌ను నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేగాక హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల అభద్రతా భావాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నక్సలైట్ల సమన్య తలెత్తే అవకాశాన్ని కూడా ఆయన కమిటీ ముందు వివరించినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌ ప్రతిపత్తి గురించి మాత్రం కిరణ్‌ ప్రస్తావించలేదని తెలిసింది. అయితే ముఖ్యమంత్రి పదేపదే తెలంగాణపై నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేస్తుండడంతో విసుగెత్తిపోయిన ఆంటోని తెలంగాణపై పార్టీ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు వల్ల ఎవరికైనా ఎటువంటి భయాందోళనలు ఉంటే వాటిని నమోదు చేసుకోవడం మాత్రమే తమ పనిగా ఆంటోని చెప్పినట్లు సమాచారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలసి మీ అభ్యర్థనను విన్న వించుకోండని ఆంటోని ముఖ్యమంత్రికి, ఇతర సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం దిగ్విజయ్‌ సింగ్‌ విలేఖరులతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి కిరణ్‌ సంక్లిష్టమైన పరిస్థితిని తేదీలలో అభ్యర్థనలను స్వీకరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై మరోమాటే లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. పార్టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంలో మార్పేమీ లేదని తేల్చి చెప్పింది. ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతల అభిప్రాయాలపై పార్టీ కులంకషంగా చర్చిస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆంటోనీ కమిటీకి అందరూ తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను కూడా కమిటీ వింటుందని చెప్పారు. బుధవారం దిగ్విజయ్‌ ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. ఇంతదూరం వచ్చాక తెలంగాణపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణపై మరో మాటే లేదని స్పష్టం చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ను తప్పు పట్టడం అనైతికమని తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత చివరగా, కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్‌ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ‘తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాయి. పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే కాంగ్రెస్‌ తన అభిప్రాయం చెప్పింది. ఇందులో మా పార్టీని తప్పుబట్టాల్సింది ఏవిూ లేదు’ అని అన్నారు. అప్పట్లో అనుకూలమని, ఇప్పుడు కాంగ్రెస్‌ నిర్నయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. మిగతా పార్టీలు ఇప్పుడు నిర్ణయం మార్చుకుంటే తామేవిూ చేయలేమని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను దిగ్విజయ్‌ తోసిపుచ్చారు. విభజన విషయంలో చాలా చర్చలు జరిపామని ఆయన గుర్తు చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలు విన్నాకే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని, ఇందులో తమ పార్టీ తప్పేమిటని ప్రశ్నించారు.రాష్ట్ర విభజనకు సంబంధించి అందరి డిమాండ్లను ఆంటోనీ కమిటీ చర్చిస్తుందని చెప్పారు. రాయల తెలంగాణ, హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం లాంటి అంశాలు కూడా ఆంటోనీ కమిటీ ముందుకు చర్చకు వస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటిపై కమిటీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందననారు. సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచన చేసుకోవాలని దిగ్విజయ్‌ కోరారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవద్దని సూచించారు. ఉద్యోగులు విద్యార్థులకు సహకరించాలని కోరారు. సీమాంధ్రుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీమాంధ్రుల అభిప్రాయాలు, ఆందోళనలు తెలుసుకొనేందుకే ఆంటోనీ కమిటీ ఏర్పాటైందని, అందరి అభిప్రాయాలను కమిటీ సావధానంగా వింటుందని తెలిపారు. ఎవరైనా కమిటీకి అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. తెలంగాణ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తేల్చి చెప్పింది. సుదీర్ఘంగా ఉన్న తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే విభజన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా విభజన కోరినందునే తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించామని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సీఎంకు వివరించారు. పార్టీ హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తదుపరి ప్రక్రియ ముందుకు సాగేలా సహకరించాలని ఆదేశించారు. సీమాంధ్రలో నెలకొన్న ఆందోళలను తక్షణమే చల్లార్చాలని తేల్చిచెప్పారు. సమైక్య ఉద్యమాన్ని నియంత్రించేందుకు అవసరమైన మార్గనిర్దేశనం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న సీఎం కిరణ్‌.. బుధవారం పార్టీ అధినేత్రి సోనియాతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టాన్న్రి సమైక్యంగానే ఉంచాలని సీఎం కిరణ్‌ గట్టిగా విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. దాదాపు గంట పాటు సోనియాతో జరిగిన సమావేశంలో కిరణ్‌.. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలను వివరించారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్యోగుల సమ్మెను అధినేత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైకమాండ్‌ నిర్ణయంపై సీమాంధ్రలో ఊహించని స్థాయిలో ఉద్యమం వచ్చిందని తెలిపారు. విభజన వల్ల ఇరువైపులా నష్టం వస్తుందని, నిధులు, నీటి పంపకాలు, ఉద్యోగులు, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, హైదరాబాద్‌ సహా తదితర అంశాలపై వివాదాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఊహించని రీతిలో ఉద్యమం కొనసాగుతోందని, పార్టీ పరిస్థితి తీవ్రంగా దిగజారిందని వివరించారు. విభజన నిర్ణయం వల్ల రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌కు నష్టమే తప్ప లాభం లేదని పేర్కొన్నారు. అయితే, కిరణ్‌ చెప్పిందంతా విన్న సోనియా.. ఎవరైనా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దామనే నిర్ణయం తీసుకున్నామని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు. దాదాపు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమనే చెప్పాయని, ఆ తర్వాతే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందన్నారు. ఇదే విషయాన్ని సీమాంధ్ర ప్రజలకు వివరించాలని సూచించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి తమకు తెలుసని, కొద్దిరోజులైతే చల్లబడిపోతుందన్నారు. ఆందోళనకారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎంకు సూచించిన అధినేత్రి.. రాష్ట్రంలోని పరిస్థితులను నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆందోళనలు చల్లార్చి విభజన ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అధినేత్ర మాటలతో కంగుతిన్న ముఖ్యమంత్రి ముభావంగా బయటకు వచ్చారు.