కిరణ్‌ కిరికిరి హైదరాబాద్‌ కోసమే


సెప్టెంబర్‌ 7న మరో మిలియన్‌ మార్చ్‌
తెలంగాణ ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై పెత్తనం కోసమే సమై క్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారని తెలం గాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. రాష్ట్ర విభజ నపై ముఖ్యమంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. సెప్టెంబర్‌ 7న చలో హైదరాబాద్‌ పేరుతో మహాశాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, సీమాంధ్రులు విద్వేషాలు వీడి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద శాంతిదీక్షలు నిర్వహించారు. దీక్షలో జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్నారు. శాంతిదీక్షలను టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాజీమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ పెట్టుబడి దారుల ప్రోత్సాహంతోనే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులు విజ్ఞతతో వ్యవహరించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. తెలంగాణ ఆకాంక్ష నిన్న మొన్నటిది కాదని, అరవై ఏళ్లుగా అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. ఇంతటి సుదీర్ఘ పోరాటం చరిత్రలోఏదీ లేదన్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణకు అడ్డుపడొద్దని కోదండరాం సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలిసుందామని, రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు విజ్ఞతతో వ్యవహరించి విభజనకు సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు కోదండరాం తెలిపారు. ఇందులో భాగంగా శాంతి యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌ 7న మరో మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు.