బలవంతంగా కలిసి ఉండమనడం రాజ్యాంగ వ్యతిరేకం


తెలంగాణను అడ్డుకునే కుట్రలు : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) :
తెలంగాణలోని ప్రజలు కలిసి ఉందామంటేనే ఉమ్మడి రాష్ట్రం సాధ్యం అవుతుందనే కనీస జ్ఞానం లేకుండా సీమాంధ్రకు చెందిన నేతలు, పార్టీలు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని టీ జేఏసీ చైర్మన్‌ కోదం డరామ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందిరాపార్క్‌ వద్ద శాంతి సద్భావన కోసం శుక్రవారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తాము ప్రజలంతా శాంతి యుతంగా ఉండాలని కోరుతూ సద్భావన యా త్రలు, దీక్షలు చేస్తుంటే సీమాంధ్ర చానళ్లు కనీసం చూపించకుండా లేని ఉద్యమాన్ని తిప్పిందే తిప్పు తూ అనైతికంగా వ్యవరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకా తెలంగాణ ప్రజలు, ఉద్యమాలు ఉన్నాయనే విషయం కూడా చూపించలేని వారిపట్ల రాబోయే రోజుల్లో కఠినంగానే తమ వైఖరి ఉంటుందన్నారు. సీఎం ఎన్నో రకాల మాట లు చెప్పినంక కూడా తెలంగాణ ప్రజలు ఇంకా ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు. తన పొలాల కు నీరు రాదనే సమైక్యంగా ఉంచాలని కోరుతున్నట్లు సీఎం పేర్కొన్న ఒక్క మాట చాలన్నా రు విడిపోవడానికి. ఇంతకాలం తమను కాదని లాక్కుపోయానని తనకు తానే బహిరంగంగా ఒప్పుకున్నాడని పేర్కొన్నారని కోదండరామ్‌ పేర్కొన్నారు. తెలంగాణ నీటిలో మాకు వాటా కావాలని పట్టుబడుతున్నాడంటేనే ఆయన అనైతిక చర్య బయట పడిందన్నారు. ఇంత దూరం వచ్చాక ఇంకా కలిసి ఉండాలనుకోవడం లేదన్నారు. ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా కలిసి ఉండేందుకు ఇష్టంగా లేడన్నారు. ఇప్పటికైనా శాశ్వతంగా వేరు కావాలనే పట్టుదల రోజురోజుకు పెరుగుతుందన్నారు. తెలంగాణను కిరణే కాదు ఆయన అబ్బగాని చివరకి ఆ దేవుడు వచ్చినా కూడా ఆపలేడన్నారు. తెలంగాణ ప్రజలు సహాయ నిరాకరణ చేస్తే సీమాంధ్రులకే నష్టం అధికంగా ఉంటుందన్నారు. తాము చేపట్టబోయే సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల సీమాంధ్రులు అన్ని రకాలుగా నష్టపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఇప్పటికే అన్ని రకాలుగా క్రిందికి పోయి ఉందన్నారు. నేడు ఇంతకంటే ఇంకా క్రిందకు పోయే పరిస్థితే లేదన్నారు. ఏమైనా ఉంటే సీమాంధ్రులే తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరించారు. కొందరేమో తెలంగాణ ఇవ్వాలే కాని ఇప్పుడు కాదనడం భ్రమే అవుతుందన్నారు. ఇంకెప్పుడు ఇవ్వాలో 60 ఏళ్ల తర్వాత పోరాటం తర్వాత కూడా కాదా అని ప్రశ్నించారు. 2012 డిసెంబర్‌లో అఖిలపక్ష సమావేశం జరిగిందని, ఆ తర్వాత ఎనిమిది నెలలు సమయం గడిచిపోయినా కూడా తొందరెలా అవుతుందో వారే సమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో తెలంగాణకు చెందిన వ్యక్తి గడిచిన 25ఏళ్లలో సీఎంగా నాయకత్వం వహించాడా అని నిలదీశారు. తెలంగాణకు చెందిన నేతలకు రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదా అని ప్రశ్నించారు. టీడీపీలో కూడా బావాబావమర్దులు తప్ప తెలంగాణకు చెందిన వ్యక్తికి నాయకత్వం ఇస్తారా అని నిలదీశారు. సినిమాలు, టీవీలు, పత్రికలు అన్నీ మీవే అయినంక కూడా తెలంగాణ మాది మాకు కావాలని కోరుకోవడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సద్భావన సదస్సులు నిర్వహిస్తుంటే రోజురోజుకు అనుమతి కోసం పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, సీమాంధ్రలో ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు రోజుల తరబడి దీక్షలకు ఎలా అనుమతిస్తున్నారని కోదండరామ్‌ ప్రశ్నించారు. సమైక్యంగా ఉంచాలనుకునే వారు అనేకం చెపుతామంటున్న వారు చూపిస్తున్నది కేవలం నీరు, హైదారాబాద్‌ను మాత్రమే చూపించడం దుర్మార్గమన్నారు. ఈ సమస్యలు పరిష్కరించే స్థాయి ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ఆయన నిలదీశారు.