తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది


అవసరమైతే సీమాంధ్రులకు మరో కమిటీ
ముందస్తు ఎన్నికలుండవ్‌ : సోనియా
జర్నలిజం అంటే వేధించడం కాదు
మీడియాకు విశ్వసనీయతే ప్రాణం : ప్రధాని
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (తెలంగాణ) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. ఢిల్లీలో మీడియా సెంటర్‌ ప్రారంభం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలను ఆమె కొట్టి పారేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. యూపీఏ-2 ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 2014లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో యూపీఏ సంకీర్ణ సర్కారు విజయఢంకా మోగించి అధికార పీఠాన్ని ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంటామని తెలిపారు. 2014లో జరిగే ఎన్నికల్లో యూపీఏ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు. ఒకవేళ దేశంలో ఎన్నికలు ముందుగా వచ్చిన తమ సంకీర్ణ సర్కారు వంద శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏ గెలుస్తుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘వంద శాతం’ అని బదులిచ్చారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. యూపీఏ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఆహార భద్రత బిల్లును పార్లమెంట్‌ ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందని తెలిపారు. ముంబైలో ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. శనివారం ఉదయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన జాతీయ మీడియా సెంటర్‌ను సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. మీడియాకు విశ్వసనీయతే ప్రాణమని, దాన్ని కాపాడుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సూచించారు. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో సంచలనాల కోసం పాకులాడవద్దని హితవు పలికారు. 1990ల నుంచి మీడియా రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందన్నారు. మీడియా సంచలనాల కోసం పాకులాడకుడా భారత జాతి అభివృద్ధికి పాటుపడేలా వ్యవహరించాలని, సమాజ నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలు ప్రతి ఒక్కరికి చేరేలా మీడియా కృషి చేయాలని సూచించారు. అలాగే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న ఫలితాలను ప్రజలకు చేరవేయాలన్నారు. రెండు దశాబ్దాల్లో వచ్చిన టెలికాం విప్లవంతో ఇంటర్నెట్‌ సదుపాయం, తక్కువ ధరకే బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలను అందిస్తున్నామని చెప్పారు. మీడియా వాచ్‌డాగ్‌లా పని చేయాలని సోనియాగాంధీ సూచించారు. ప్రభుత్వం పట్ల మీడియా శత్రుభావంతో వ్యవహరించొద్దని కోరారు. తమ ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా వ్యవహరించాలని కోరారు.