సీఎం, డీజీపీలే సమైక్య ఉద్యమం నడుపుతుండ్రు


హరీశ్‌, ఈటెల ఫైర్‌
విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వెనుకుండి సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. సీమాంధ్ర జేఏసీకి చైర్మన్‌గా సీఎం, కన్వీనర్‌గా డీజీపీ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ అధికారిపై దాడికి నిరసనగా తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు సోమవారం విద్యుత్‌ సౌధాలో మహాధర్నా చేపట్టారు. అధికారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు విద్యుత్‌సౌధకు వచ్చారు. అయితే, వారిని పోలీసులు లోనికి అనుమతించ లేదు. మీడియాను అనుమతించేందుకు నిరాకరించారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తామన్న హరీశ్‌రావు తదితరులను అనుమతించ లేదు. ఈ సందర్భంగా తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు హరీశ్‌ సహా పలువురిని అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అంతకు ముందు హరీశ్‌రావు మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనకు అనుమతించి, తెలంగాణవాదులను అణచివేయడమేమిటని ప్రశ్నించారు. నగరంలో రక్షణ కావాల్సింది తెలంగాణ వారికా? సీమాంధ్రులకా? అని హరీశ్‌ ప్రశ్నించారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నెల్లూరులో తెలంగాణకు చెందిన జిల్లా అధికారిపై సీమాంధ్రలు దాడి చేశారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నర్సు శిక్షణ కోసం వెళ్తే వెనక్కు పంపించేశారని, విద్యార్థులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులు గన్‌మెన్లను పెట్టుకొని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు సీమాంధ్రలో ఉన్నాయన్నారు. మరలాంటప్పుడు రక్షణ కావాల్సింది సీమాంధ్రులకా? తెలంగాణ వారికా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సీమాంధ్ర ఉద్యోగిపైనైనా దాడి జరిగిందా? అని అన్నారు. సమైక్య ఉద్యమం పేరుతో తెలంగాణ ఉద్యోగుల మీద, ప్రజల మీద, విద్యార్థుల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ వాదులను అణచివేస్తున్న డీజీపీకి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, అన్యాయాలు, అరాచకాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్రలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వారిని, విధ్వంసాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోకుండా ఉద్యోగిపై జరిగిన దాడికి నిరసనగా చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మమ్మల్ని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణలోనే చట్టం పని చేస్తుందా? సీమాంధ్రలో చట్టం పని చేయడం లేదా? అని నిలదీశారు.