భూ సేకరణ బిల్లు ఆమోదం
చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
119 ఏళ్ల చట్టానికి బూజు దులిపిన యూపీఏ
న్యూఢిల్లీ, ఆగస్టు 29(జనంసాక్షి) :
ప్రతిష్టాత్మక భూసేకరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం పట్టుబట్టిన భూసేకరణ బిల్లును లోకసభ గురువారం ఆమోదించింది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు తరువాత అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతి ముఖ్యమైన బిల్లు ఇది. ఈ బిల్లు పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువపై నాలుగు రేట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్టు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. నిర్వాసితులను అభివృద్ధిలో భాగస్వాములని చేసే ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ లోకసభలో ప్రవేశపెట్టారు. గతంలో బ్రిటీష్ వారి పాలనాకాలంలో 1894లో ప్రవేశపెట్టిన పురాతన కాలం నాటి భూసేకరణ చట్టాన్ని చెత్తబుట్టలోకి విసిరేసి, దాని స్థానంలో భూసేకరణలో సరైన పరిహారం పొందే హక్కు, పారదర్శకత, పునరావాస బిల్లుగా దీన్ని పిలవనున్నారు. ఈ బిల్లుపై గురువారం లోకసభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 235 మంది పాల్గొనగా, అనుకూలంగా 216 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓట్లు వేశారు. ఇది చాలా చారిత్రకమైన ముందడుగని, తొలిసారిగా భూసేకరణలో పారదర్శకతను ఇది తీసుకొస్తుందని కాంగ్రెస్ ఎంపీ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. బీజేపీ సూచించిన రెండు సవరణలతో పాటు మొత్తం 166 సవరణలతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఎంపీలు తమ తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను, లోపాలను తెలియజేస్తున్నారు. రీ-హాబిటేషన్, రీ-సెటిల్‌మెంట్‌పై చర్చ సాగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూసేకరణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. నూతన భూసేకరణ చట్టంతో వివిధ సందర్భాల్లో భూసేకరణ అనివార్యత, నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లింపుల వల్ల సామాన్య రైతులకు మంచిరోజులు రానున్నాయి.