జెట్‌ స్పీడ్‌తో తెలంగాణ


పార్లమెంట్‌ సమావేశాల తర్వాత కేబినెట్‌ భేటీ
సిద్ధమవుతున్న నోట్‌
మంత్రుల బృందం ఏర్పాటు
నీళ్లు, నిధులు, అప్పులు, ఆస్తుల పంపకాలపై కసరత్తు
కేబినెట్‌ ముందుకు తెలంగాణ
పది జిల్లాల తెలంగాణే పరిశీలనలో : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జెట్‌ స్పీడ్‌తో సాగుతోంది. పార్లమెంట్‌ సమావేశాల తర్వాత కేబినెట్‌ భేటీ అయి తెలంగాణపై చర్చిస్తుంది. ఈనెల ఆరో తేదీన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియనుండగా 12న కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ భేటీలోనే తెలంగాణపై హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన నోట్‌ను మంత్రులు చర్చిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణపై కేంద్రం అనుసరించాల్సిన వైఖరిపై విపులంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారవర్గాలు ఎనిమిది పేజీలతో కూడిన నోట్‌ను రూపొందిస్తున్నారు. దానికి అనుబంధంగా కొన్ని పత్రాలు, వివరణలతో కూడిన అనుబంధాన్ని కూడ సిద్ధం చేస్తున్నారు. హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అనారోగ్యం కారణంగా చాలా కాలంలో ముంబయిలోనే ఉండటం వల్ల కాస్త ఆలస్యమైన తెలంగాణ నోట్‌ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా సిద్ధమవుతోంది. కేబినెట్‌లో తెలంగాణపై చర్చ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా పంపకాలపై పూర్తిస్థాయి సంప్రదింపులు, నిర్ణయాల కోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తారు. నీళ్లు, నిధులు, అప్పులు, ఆస్తుల పంపకాలపై నోట్‌లోనే కసరత్తు పూర్తి చేసి వాటిని మంత్రుల బృందానికి అప్పగిస్తారు. మరోవైపు తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో నెలకొన్న సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి వాటిని హోం మంత్రిత్వ శాఖ ముందు పెట్టనుంది. అనంతరం మంత్రుల బృందం విభజన సందర్భంగా తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపుతుంది. సీమాంధ్రులకు కొత్త రాజధాని, విభజన అనంతరం నిధులు, నీళ్లు, విద్యుత్‌, అప్పులు ఇతరత్రా అంశాలపై కులంకశంగా చర్చించి సీమాంధ్రుల అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఆదివారం తెలంగాణ ప్రక్రియ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటే తమ పరిశీలనలో ఉందన్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలను పరిష్కరిస్తామని అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విభజన తర్వాత వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పారు.