తెలంగాణను నువ్వే అడ్డుకున్నావా? ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నావ్
టీడీపీ అధినేతపై హరీశ్ ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (జనంసాక్షి) :
తెలంగాణాను తాను అడ్డుకున్నానని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పిన చంద్రబాబు నేడు కూడా అడ్డుకోవడమే తన లక్ష్యంగా ముందుకు పోతున్నావా ప్రజలకు సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణా భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్ర విభజన తర్వాత చేసేదేమిలేక ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పదలుచుకున్నావని ఆయన నిలదీశారు. సీమాంధ్ర ప్రజల ఉద్యమం న్యాయమైనదే అయితే తెలంగాణ ఉద్యమం, 42రోజుల సకల జనుల సమ్మె, వెయ్యి మంది ఆత్మబలిదానాలు అన్యాయమా బస్సుయాత్రలో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. సీమాంధ్రలో న్యాయంకోసం పోరాటాలు జరుగుతుంటే తాను ఇంట్లో కూర్చోవడం బాగాలేదని యాత్రకు వచ్చానంటున్న బాబు తెలంగాణాలో ఆత్మబలిదానాలు, ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఎందుకు నోరు మెదపలేదన్నారు. తెలంగాణ ప్రజలు నీకు పట్టరని నీకునీవే చెప్పదలుచుకున్నావా అని విమర్శించారు. తెలంగాణాలో ఇప్పటికీ పాలమూరు జిల్లావాసుల వలసలు, తెలంగాణాలోని వారి గల్ఫ్‌బాటలు, 610 జిఓలో అన్యాయాలకోసం, క్రిష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణా వాటా ఎంతని, రైతులు విద్యుత్‌కోసం చేసిన పోరాటాలు అన్యాయమో కచ్చితంగా వెల్లడించాకే సీమాంధ్రలో యాత్ర కొనసాగించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఇవన్నీ అన్యాయమే అయితే అన్యామని చెప్పాలని సవాల్ విసిరారు. ఆనాడు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణాను అడ్డుకున్నానని ఖచ్చితంగా చెప్పుతున్నాడంటేనే ఆయన సీమాంధ్ర బాబు మాత్రమేనని తేలిపోయిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి అడ్డుకోవడం చేతకావటం లేదని, తాను ప్రజల్లోకి వచ్చి అడ్డుకుంటాననే ధీమాతోనే వచ్చావా అని నిలదీశారు. నీయాత్రలు కాదుకదా జేజమ్మ దిగి వచ్చినా కూడా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడం ఆగదన్నారు. ఈవిషయం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నెలరోజుల్లో వందల సార్లు స్పష్టం చేసిందన్నారు. రెండుకళ్ల బాబుకు తెలంగాణాకన్ను మసకబారిపోయినట్లుందని, అందుకనే సీమాంధ్ర ప్రజలు చేస్తున్నది న్యాయమైన పోరాటంగా చెపుతున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయంపేరుతో వచ్చిన చిరంజీవి పిఆర్పీ జండాను తెలంగాణాలో పీకేసి కాంగ్రెస్‌లో కలిపేసుకున్నాడని, నేడు వైసిపి సైతం తెలంగాణాలో ఎత్తేసి సీమాంధ్రలో ఓట్లు, సీట్లకోసం ఆరాట పడుతోందన్నారు. టీడీపీని కూడా అలాగే చేయడం లక్ష్యమా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో టిటిడిపి ఫోరం నేతలను, పార్టీ క్యాడర్‌కు ఎందుకు మోసం చేస్తున్నావని ప్రశ్నించారు. తెలంగాణాకోసం పుట్టిన పార్టీ కేవలం ఉద్యమాలపైనే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌తో ప్యాకేజీలు ఎవరు చేసుకుంటున్నారో ప్రజలందిరికి తెలుసన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దెదింపడానిక టిడిపి ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు కుదుర్చింది నీవు కాదా అన్నారు. ప్యాకేజీలు ఇచ్చి వెన్ను పోటు పొడిచింది వాస్తవం కాదా అన్నారు. రాజకీయాల్లో హత్యచేయాలని కుట్ర జరుగుతుందని గగ్గోలు పెట్టడం దుర్మార్గమన్నారు. 9 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బాబుకు రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలేనని తెలువకపోవడం బాదాకరమన్నారు. చచ్చిన పాముగా ఉన్న నిన్ను చంపడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు పని అవసరమే లేదన్నారు. ఇప్పటికే తెలంగాణాలో బాబును నమ్మడం లేదని, సీమాంధ్రలోనైనా నమ్మిద్దామనుకోవడం దుర్మార్గమే అవుతుందన్నారు. గతంలో ప్రధానమంత్రిని ఉద్దేశించి అత్యంత విలువైన చప్రాసీతో పోలుస్తూ తిడితే గగ్గోలు పెట్టిన బాబు నేడు యాత్రలో ప్రధానిని సోనియాగాంధికి కాపలా కుక్కలాగా, పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నాడని మాట్లాడడం ఎం నీతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నీవు మాట్లాడితే నీతి ఇంకొకరు మాట్లాడితే అక్రమం, అనైతికం అవుతుందా అని హరీష్‌రావు ప్రశ్నించారు. తాను స్టేట్స్‌మెన్‌ను అంటూ గొంతు చించుకుని అరుస్తున్న బాబు అదే నిజమైతే కేంద్రం రాష్ట్రవిభజన పూర్తి చేశాక ఉత్పన్నం అయ్యే సమస్యలపై ఎందుకు చొరవతీసుకుని ఎజెండా తయారు చేయడం లేదని నిలదీశారు. క్యాబినెట్ ¬దాలో ఉన్న ప్రతిపక్షనేతవు కాదా అని ప్రశ్నించారు. ఎజెండా తయారు చేసి ఇరుప్రాంతాల జెఎసిలు, మేధావులు, ఉద్యమకారులు, పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఓ చక్కనైన మార్గదర్శకాన్ని కేంద్రానికి పంపించొచ్చుకదా అన్నారు. అంటే నీది పచ్చి అవకాశవాదమే అని తేలిపోయిందన్నారు. ఆర్టికల్ మూడు ద్వారా రాష్టాన్న్రి విభజించి సీమాంధ్ర, తెలంగాణాలను అభివృద్ది చేయాలని పట్టుపట్టిన వైఎస్సార్‌సిపి నేడు తెలంగాణాలో తోకముడిచాక సమైక్యం అంటూ సీమాంధ్రలో యాత్రలు నిర్వహించడం మోసం చేయడం కాదా అని హరీష్‌రావు సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తెలంగాణా ఇస్తే అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నానని గొంతు చించుకుని చెప్పిన సిఎం కిరణ్ నేడు ధిక్కార ధోరణిని ఎందుకు అవలంబిస్తున్నాడో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ¬దాలో ఉండి ఇలా ఒకప్రాంతం పక్షపాతిగా మాట్లాడేందుకు నోరెలా వస్తుందన్నారు. దమ్ముంటే సిఎం సీటు నుంచి తప్పుకుని స్వచ్చందంగా సీమాంధ్రలో ఉద్యమానిక నాయకత్వం వహించాలని కిరణ్‌ను హరీష్‌రావు నిలదీశారు. టిడిపి, వైసిపి, కిరణ్‌లు ముగ్గురు సైతం సీమాంధ్ర ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారి వలలో పడవద్దని హరీశ్‌రావు హితవు పలికారు. వారి గారడీ మాటలను తెలంగాణా వారు నమ్మకపోవడం వల్లే నేడు సీమాంధ్రకు పరుగులెత్తుకుంటూ వస్తున్నారన్నారు. తెలంగాణావారైనా, ఆంధ్రావారైనా, కన్నడీలైనా, మరాటీలైనా ఇంకెవరైనా భారత రాజ్యాంగానికిలోబడి నడుచుకోవాల్సిందేనని, ఇందుకు తెలంగాణా వారం అతీతులం కాదన్నారు. సీమాంధ్రులు వారి గారడీ మాటలకు పడిపోవద్దన్నారు. హైదరాబాద్‌లో ఉండడానికైనా, వ్యాపారాలు చేసుకోవడానికైనా, ఉద్యోగాలు చేసుకోవడానికైనా సరే తెలంగాణా వారిక ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. మరోసారి సీమాంధ్ర ప్రజలను కన్‌ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైసిపి, టిడిపిలపై హరీష్‌రావు ఆరోపించారు. ఈరెండు పార్టీలు కూడా కేవలం ఓట్లు, సీట్లకోసమే యాత్రలు చేస్తున్నాయని ప్రజలు గుర్తించాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్క కార్యాలయంలో ఉన్న సీమాంధ్ర, తెలంగాణా ఉద్యోగులు మాటలయుద్దం, తోపులాటలు, విమర్శలు చేసుకుంటూ వచ్చాక మళ్లీ కలిసి ఉండడం సాద్యం ఎలా అవుతుందన్నారు. ఇంతదూరం వచ్చాక మళ్లీ కలిసి పనిచేయలేరన్నారు. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణా వారు ఇంకా సంయమనంతో వ్యవహరిస్తున్నా రని, బాబు అనుకుంటున్నట్లుగానో, కిరణ్, జగన్ వ్యూహాలతోనో తెలంగాణాను అడ్డుకోవాలని చూస్తే మాత్రం రానున్న కాలంలో మరోసారి తెలంగాణా సత్తాఏమిటో చూపిస్తామన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తోందని, కాంగ్రెస్‌ది రాజకీయమని, ఓట్లు సీట్లకోసం ప్రాకులాడుతుందని గగ్గోలు పెడుతున్న బాబు 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నది సిఎం సీటుకోసమేనా చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. రాజకీయాల్లో నీతి తప్పి మాట్లాడొద్దన్నారు. ఇప్పటికైనా బాబు, విజయమ్మ, కిరణ్‌లు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి సీమాంధ్రలో ప్రజలకు వచ్చే సమస్యలపై కేంద్రంతో పోరాడేందుకు సిద్దంగావాలని హరీష్‌రావు హితవు పలికారు. సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈరెండు పార్టీల గారడీ మాటలకు లొంగవద్దన్నారు. సీమాంధ్రకు చెందిన ఏపిఎన్జీఓలు, వివిధ ఉద్యోగ సంఘాలు తమకున్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు, కావాల్సిన డిమాండ్లపై స్పష్టమైన వైఖరితో మందుకు రావాలని, అనవసరంగా ఉద్యమాలు చేస్తూ రెండు ప్రాంతాల్లోని ప్రజలమద్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నించ వద్దని హరీష్‌రావు సూచించారు.