ముల్కీ అమరుల వారసత్వానికి కొనసాగిస్తాం
శాంతిర్యాలీకి లక్షలాదిగా తరలిరండి : కోదండరామ్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 2 (జనంసాక్షి) :
ముల్కీ అమరుల వారసత్వాన్ని కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన ముల్కి అమరవీరుల సంస్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి ర్యాలీకి లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర నాయకుల ఆస్తులను వదిలేయాల్సి ఉంటుందనే హైదరాబాద్‌ను వదిలి వెెళ్లలేక సమైక్య రాష్ట్రమని కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంటోని కమిటీ ఎదుట సీమాంధ్ర నాయకులు చేసిన వాదనలన్నీ వైఫల్యం చెందినవేనని, హైద్రాబాద్‌పై ఆధిపత్యం కోసమే కుట్రలు పనున్నతున్నారని ఆరోపించారు. విషయం ఇరు ప్రాంతాలలోని సామాన్య ప్రజలందరికీ అర్థమైందని పేర్కొన్నారు. ప్రాంతీయ మండలి హైద్రబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని వంటి వాదనలు అర్థంలేనివని అన్నారు. శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు కోసం శాంతియుత ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో హైటెక్ సిటీ, ఓవర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్నారు కాని తెలంగాణ భూములను ఆయా కంపెనీలకు లీజుకిచ్చి, ఆమ్మి అభివృద్ది చేసారని మాత్రం చర్చించడం లేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర వ్యాపారులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వారికి అవసరమున్న ప్రాంతాల్లో అభివృద్ది చేసారన్నారు. ఇప్పటికే క్రృష్ణ, గోదావరి జాలాలు ప్రాంతాల వారిగా పంపిణీ చేయబడ్డాయ న్నారు. రాష్ట్రం విడిపోతే ఎలా నష్టం జరుగుతుందో ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడూ చెప్పడం లేదన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్ర ఉద్యోగులు ఉద్యమాలు చేస్తే వారిపై కేసులు పెెట్టారు. కాని సీమాంద్ర ఉద్యోగులు ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. పోరాటం ద్వారా తెలంగాణ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.