శరవేగంతో తెలంగాణ


న్యాయశాఖ, అటార్ని జనరల్‌ పరిశీలనకు టీ నోట్‌
వారం రోజుల్లో కేబినెట్‌ ముందుకు
విభజన ప్రక్రియ 215 నుంచి 125 రోజులకు కుదింపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సీమాంధ్ర ప్రాంత ప్రజలను వాదనలు పరిగణలోకి తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించిన రోజే తెలంగాణ నోట్‌ను కేంద్ర హోం మంత్రిత్వశాఖ న్యాయశాఖకు పంపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి, భారత ప్రభుత్వ అటార్ని జనరల్‌ ఈ నోట్‌ను క్షుణ్నంగా పరిశీలించి న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని ప్రస్తావిస్తూ వారం రోజుల్లోగా తిరిగి హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. హోం శాఖ తెలంగాణ నోటును కేంద్ర కేబినెట్‌ ముందుకు తీసుకువస్తుంది. నోట్‌కు మంత్రివర్గ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తలెత్తే అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం, నిధులు, అప్పులు, ఉద్యోగాలు, విద్యుత్‌, నీళ్ల పంపిణీపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తారు. మంత్రుల కమిటీ టీ నోట్‌పై సమగ్ర అధ్యయనం పూర్తి చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేస్తుంది. 2014 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిల్లును వీలైనంత త్వరగా పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని కేంద్ర కృత నిశ్చయంతో ఉంది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర విభజన ప్రక్రియ గడువును 215 రోజుల నుంచి 125 రోజులకు కుదించింది. ఈలోగానే తెలంగాణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయాన్ని సేకరిస్తుంది. తీర్మానంతో సంబంధం లేకుండా కేవలం అభిప్రాయాన్ని తీసుకొని ఆర్టికల్‌ 3 ప్రకారం కేంద్రం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకువస్తుంది. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతునిస్తుండటంతో ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందడం పెద్దకష్టమేమీ కాదు. ఒకవేళ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ విభజనపై రాజ్యాంగ పరమైన ప్రక్రియ పూర్తికాకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువస్తారు. ఓట్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలను నాలుగైదు రోజులు పొడిగించైనా తెలంగాణపై సభలో తీర్మానం చేస్తారు. వైద్య పరీక్షల కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సోనియాగాంధీ వీలైనంత త్వరగా విభజన ప్రక్రియపై కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు హోం శాఖ అధికారులు ఇదే పనిలో బిజీగా ఉన్నారు.