సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తుండు


ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా 24 గంటల బంద్‌
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ పిలుపు
హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి సీమాంధ్ర పక్షపాత వైఖరిని నిరసిస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో 24 గంటల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. ఏపీఎన్జీవోలు 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సమైక్యాంధ్ర సభకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వడంపై కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని టీఎన్జీవోల భవ నంలో నిర్వహించిన టీ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సమైక్యవాదుల సభకు అనుమతి ఇవ్వడాన్ని నిరసి స్తూ శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సంఘ వ్యతిరేక శక్తులపై పోలీసుల కేసు నమోదు చేయాల్సింది పోయి, విద్యార్థులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కేంద్రప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రంపై గట్టి ఒత్తిడి తెస్తామని కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో సమైక్యవాదం వినిపించే సభలకు అనుమతించడం తగదని, ఇందుకు తెలంగాణ ప్రజలు సహించరని కోదండరాం వెల్లడించారు. ఈ సమయంలో ఏ ఒక్క బిడ్డ ప్రాణం పోయినా అందుకు బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఒక ప్రాంత ప్రజలు హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తుంటే మరో ప్రాంత ప్రజలు ఉద్యమం చేయడం రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి మద్దతు పలకడం తెలంగాణ ప్రాంత ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసిందని అన్నారు. టిజెఎసి ఇచ్చిన 24 గంటల తెలంగాణ బంద్‌ పిలుపును తెలంగాణవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. తాము నిజాం కాలేజీ గ్రౌండ్‌లో సభ పెడతామంటే ముందు అనుమతి తెచ్చుకోండి తర్వాత చుద్దామన్న సీఎం ఏపీఎన్‌జీవోల సదస్సుకు ఆఘమేఘాల మీద అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. ఒక ప్రాంత ప్రజలు హక్కుల కోసం ఉద్యమిస్తుంటే మరో ప్రాంత ప్రజలు పోటీ ఉద్యమం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి ఉద్యమానికి సీఎం మద్దతిస్తున్నాడని మండిపడ్డారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారని అన్నారు. తమ పోరాటం రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్ప సామాన్య సీమాంధ్ర ప్రజలపై కాదని, వారిపట్ల తమకెలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. ముఖ్యమంత్రి కుట్రల కారణంగానే తెలంగాణలో మళ్లీ బలిదానాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో బిల్లుపెడితేనే కుట్రలు ఆగిపోతాయి
వరంగల్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘ పోరాటాల తర్వాత సాధించుకుంటే కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు, హైదరాబాద్‌ దోపిడీదారులు కుట్రలమీద కుట్రలు పన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీఓలు సమైక్య సభ నిర్వహించడం అంటే ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి వచ్చిన తెలంగాణాను అడ్డుకోవడమేనని ఆరోపించారు. తమకు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా కచ్చితంగా శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది ప్రభుత్వఆందోళననే అన్నారు. దీన్ని నిర్వహిస్తున్నది సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమేనన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆగస్టులోనే క్రీడలు నిర్వహించుకునేందుకు శాప్‌కు దరఖాస్తు చేసుకుంటే అనుమతివ్వకుండా తుంగలో తొక్కి, నిన్ననే దరఖాస్తుచేసుకున్న ఏపిఎన్జీఓలకు ఆఘమేఘాల మీద అనుమతిచ్చారంటే సీమాంధ్రుల పెత్తనం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఎల్‌బి స్టేడియంను కేవలం క్రీడలకు మాత్రమే ఇవ్వాలని నిబంధన ఉన్నా కూడా అధికారులు తుంగలో తొక్కి రాజకీయ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. దీనిపై కూడా న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. తెలంగాణను ఎన్ని కుట్రలు చేసి అడ్డుకోవాలని చూసినా ప్రతిఘటించి రాష్ట్రం ఏర్పాటుచేసుకుంటామన్నారు. ఒక్కటికాదు రెండు కాదు 55 సంవత్సరాల పోరాట పటిమతమలో ఉందన్నారు. తెలంగాణాలో ప్రజల ఆందోళన జరుగుతుంటే, సీమాంధ్రలో పెట్టుబడి దారులు, అధికారులైన సిఎం, డిజిపిల ఆందోళన కొనసాగుతోందన్నారు. తెలంగాణా ఉద్యమాల్లో పాటించి ఏఒక్క నిబందనను కూడా పోలీసులు సీమాంధ్రలో అమలు చేయడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అంతకు ముందు ఆయన జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశమై ఉద్యమం తీరుపై చర్చించారు.