దారిపొడవునా సీమాంధ్ర గుండాల దాదాగిరీ


ఓయూ జాక్‌ నేత బాలరాజుపై సామూహిక దాడి
సభలో జై తెలంగాణ అంటే కుర్చీలతో దాడి
ఒళ్లు మండి.. గుండె పగిలి సభలోకి దూసుకొచ్చి
జై తెలంగాణ అని నినదించిన కానిస్టేబుల్‌
ఉపన్యాసాలతో తెలంగాణపై విషం కక్కిన ఏపీఎన్‌జీవోలు
నిబంధనలకు నీళ్లు.. గజల్‌ శ్రీనివాస్‌, మిత్రా, కారెం, ఆంధ్ర జర్నలిస్టు తదితరులు వేదికపైకి
గజల్‌ శ్రీనివాస్‌ను అనుమతించిన వివాదాస్పద ఐపీఎస్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు
తప్పుల తడక.. జనగనమన
నిజాం కాలేజీ హాస్టల్‌లో పోలీసుల దాష్టీకం
టిఫిన్‌ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి
హాస్టల్‌ భవనం నుంచి విద్యార్థి తోసివేత
పీకలు కోస్తాం
మా వెంట్రుక కూడా పీకలేరు
నగరంలో రెచ్చిపోయిన సీమాంధ్రులు
సంయమనం పాటించిన తెలంగాణ బిడ్డలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :
ఏపీఎన్‌జీవోల సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ పేరుతో హైదరాబాద్‌లో సీమాంధ్ర గుండాలు రెచ్చిపోయారు. దారిపొడవునా గుండాగిరీ చేస్తూ తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. పీకలు కోస్తాం.. మా వెంట్రుక కూడా పీకలేరు.. హైదరాబాద్‌ మాదే అంటూ తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఓయూ జాక్‌ నేత బాలరాజుపై మూకుమ్మడిగా దాడి చేశారు. జుట్టుపట్టుకొని కాళ్లతో తన్నారు. మర్మాయవాలపై దాడి చేసి హత్యకు ప్రయత్నించారు. సభలో జై తెలంగాణ అని నినదించిన వ్యక్తిపై కుర్చీలతో దాడికి తెగబడ్డారు. సీమాంధ్రుల కారుకూతలు చూసి ఒళ్లు మండి జై తెలంగాణ అని నినదించిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై తోటి కానిస్టేబుళ్లతో పాటు సీమాంధ్ర గుండాలు దాడికి తెగబడ్డారు. సభ ఆధ్యంతం సీమాంధ్రులు కుట్రలతో కూడిన ఉపన్యాసాలతో తెలంగాణపై విషం కక్కారు. సభ నిర్వహణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం తుంగలో తొక్కారు. వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులు మళ్లీ అదే వైఖరి అనుసరించాడు. ఎన్‌జీవోల సభకు ఉద్యోగి కాని గజల్‌ శ్రీనివాస్‌ను తోడ్కొని సభ వేదిక వద్దకు వెళ్లాడు పీఎస్సార్‌. జనగనమన తప్పుల తడకగా పాడి ఛీ అనిపించారు. సీమాంధ్రులు ఎంతగా రెచ్చగొట్టిన తెలంగాణవాదులు సంయమనం పాటించారు. ఏపీఎన్‌జీవోల సభ అడ్డుకుంటారనే నెపంతో పోలీసులు నిజాం కాలేజీలో రణరంగం సృష్టించారు. హాస్టల్‌లోకి ప్రవేశించి టిఫిన్‌ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జికి తెగపడ్డారు. భవనం పైనుంచి ఓ విద్యార్థిని తోసేశారు. పోలీసుల దాష్టీకాన్ని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సహా తెలంగాణవాదులందూ
ఏపీఎన్జీవోలు ‘హద్దు’ మీరారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహాస్యం చేశారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసు షరతులను ఏపీ ఎన్జీవోలు అతిక్రమించారు. కోర్టు ఆదేశాలనూ తుంగలో తొక్కుతూ న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరించారు. ఏపీ ఎన్జీవోల సభ నిర్వహణకు హైకోర్టుతో పాటు పోలీసులు పలు షరతులు విధించారు. రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని, గుంపులు గుంపులుగా రావొద్దని ఆదేశించారు. నినాదాలు చేయకూడదని, ర్యాలీలు నిర్వహించకూడదని, సమావేశంలో డీజేలు వినియోగించ కూడదని స్పష్టం చేశారు. కానీ, న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి, పోలీసుల షరతులను బేఖాతరు చేసిన ఏపీ ఎన్జీవోలు చట్టాన్ని అపహాస్యం చేశారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ర్యాలీలుగా వెళ్తూ, సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ వాదుల వైపు వేలు చూపిస్తూ పీక కోస్తామని, తలలు తీస్తామని హెచ్చరించారు. గుంపుగా వస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి వారు కొందరు.. నిజాం కాలేజీ విూదుగా ఎల్బీ స్టేడియానికి బయల్దేరారు. అయితే, అప్పటికే అక్కడ తెలంగాణ విద్యార్థులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తుండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన సీమాంధ్ర ప్రాంతం వారు.. తెలంగాణ వాదుల వైపువేలు చూపిస్తూ తల తీస్తామని సైగలు చేశారు. ఈ దృశ్యం పలు చానెళ్లలో ప్రసారమైనా.. పోలీసులు చూస్తూ మిన్నకుండి పోవడం గమనార్హం.ఏపీ ఎన్జీవోల సభకు పోలీసులు 19 షరతులు విధించారు. కేవలం ఐడీ కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని, సభకు వచ్చే వారు ర్యాలీలు నిర్వహించడం, బ్యానర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం నిషిద్ధమని, డీజేలు వినియోగించకూడదని ఆదేశించారు. అలాగే, రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించొద్దని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇవే షరతులను హైకోర్టు కూడా విధించింది. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఏపీ ఎన్జీవోలే బాధ్యులని హెచ్చరించింది. అయితే, ఆయా షరతులను ఏపీ ఎన్జీవోలు ఉల్లంఘించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించకుండా రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించారు. గుంపులు గుంపులుగా వచ్చ ర్యాలీలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేస్తూ ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఇక, స్టేడియం లోపల కూడా ఏపీ ఎన్జీవోలు కోర్టు ఆదేశాలను పాటించలేదు. కేవలం ఉద్యోగులను మాత్రమే సభకు అనుమతించాలని, ఐడీ కార్డులు ఉన్న వారినే లోనికి పంపించాలన్న నిబంధనలను కాలరాశారు. ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా ప్రైవేట్‌ ఉద్యోగులను, విద్యార్థులను, కూలీలను, కార్మికులను లోనికి అనుమతించారు. ఐడీ కార్డులు లేని వారికి నకిలీ పాస్‌లు జారీ చేసి పంపించారు.
ఖాకీల పక్షపాతం
కళ్లెదుటే ఏపీ ఎన్జీవోలు షరతులు ఉల్లంఘించినా పోలీసులు మిన్నకుండిపోయారు. ర్యాలీలుగా వస్తున్న వారిని, నినాదాలు చేస్తున్న వారి పట్ల కిమ్మనలేదు. రెచ్చగొడుతున్నా చూస్తూ చూడనట్లు ఉండిపోయారు. అదే తెలంగాణవాదుల పట్ల మాత్రం కాఠిన్యం ప్రదర్శించారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల కనబడిన వారిని కనబడినట్లు అదుపులోకి తీసుకున్నారు. లాఠీలతో ఆందోళనకారుల ఒళ్లు కుళ్లబొడిచారు. ఎత్తకుంటూ తీసి వాహనాల్లో కుదేశారు. ఠాణాల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేశారు. ఈ దృశ్యాలను ప్రసారం చేయొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దాడులు, హింసాత్మక ఘటనలు ప్రసారం చేయొద్దని, రెచ్చగొట్టే ప్రసంగాలు పదే పదే వేయొద్దని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. తమది శాంతియుత పోరాటమని చెప్పుకొనే ఏపీ ఎన్జీవోలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. తెలంగాణవాదులపై పాశవిక చర్యలకు దిగారు. ఓయూ జేఏసీ నేత బాలరాజు యాదవ్‌పై దాడి చేశారు. ఎల్బీ స్టేడియం సవిూపంలో ఉన్న బషీర్‌బాగ్‌ వద్ద బాలరాజుపై కడప జిల్లాకు చెందిన ఏపీ ఎన్జీవోలు విచక్షణ రహితంగా దాడి చేశారు. ‘మీకు తెలంగాణ కావాలా?’ అంటూ ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు కురిపించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా వినిపించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించారు. వారి దాడితో తీవ్రంగా గాయపడిన బాలరాజు స్పృహ కోల్పోయారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పక్కనే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ.. చూసీ చూడనట్లు వ్యవహరించారు. అయితే, బాలరాజు స్పృహ తప్ప పడిపోవడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. సీమాంధ్ర ఉద్యోగులకు, కళాకారులకు పోలీసులు ఎర్ర తివాచీ వేసి ఆహ్వానించారు. ఉద్యోగులకు మాత్రమే అనుమతంటూ అందరినీ లోపలికి పంపంచారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు సైతం తుంగలో తొక్కుతున్నారు. దొంగతనంగా ముద్రించిన ఐడీ కార్డులను ముద్రించినా పట్టించుకోలేదు. మొదట గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొద్దిసేపటికే సీమాంధ్రకు చెందిన ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గజల్‌ శ్రీనివాస్‌ను సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. వంగపండును పోలీసులు ముందుగా లోపలికి అనుమతించలేకున్నా ఆ తరవాత ఆయననూ అనుమతించారు. సీమాంధ్రకు చెందిన కళాకారులు గజల్‌ శ్రీనివాస్‌, వంగపండు ప్రసాద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సభకు ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు స్పందించారు. కళాకారులను అడ్డుకుని రాజకీయాలు చేయొద్దని పోలీసులను ఆయన హెచ్చరించారు. దీంతో తదుపతరి వారిని లోపలికి పంపించారు. గజల్‌ శ్రీనివాస్‌ తన సమైక్యవాద పాటలతో నినాదాలు చేయించారు. ఇదిలావుంటే ఏపీ ఎన్జీవోల తీరుపై బూర్గుల రామకృష్ణారావు కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా సేవ్‌ ఆంధప్రదేశ్‌ సభకు బూర్గుల పేరు పెట్టడం హేయమైన చర్య అని కుటుంబ సభ్యులు అన్నారు. తక్షణమే ఏపీ ఎన్జీవోల సభా ప్రాంగణానికి బూర్గుల పేరు తొలగించాలని డిమాండ్‌ చేశారు. బూర్గులకు సమైక్యవాదాన్ని రుద్దడం అవివేకమన్నారు. ఇక్కడ పలువురు పేర్లతో సభకు నామాలు తగిలించారు.రాష్ట్రరాజధానిగా ఉన్నప్పటికి ఇది తెలంగాణ విభజన తర్వాత తెలంగాణకు చెందిందే అని కేంద్రం సీడబ్ల్యూసీ స్పష్టం చేసినా కూడా కావాలనే విధ్వంసాలు సృష్టించడానికేవచ్చి సమావేశం నిర్వహించబోతున్నారని తాము చెప్పిందే నిజమేనని తేలిపోయిందని టిఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ అసెంబ్లీ వద్ద ఆందోళనలో ఉన్న ఆయన విూడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సభకు కేవలం ఉద్యోగులు మాత్రమే వస్తారని చెప్పిన అశోక్‌బాబు, పోలీస్‌ కవిూషనర్‌ అనురాగ్‌శర్మ శనివారం జరిగిన వ్యవహారంపై ఏం సమాదానం చెపుతారన్నారు. ప్రతినిబంధనను తుంగలో తొక్కారని హరీష్‌రావు ఆరోపించారు. ఉద్యోగులే వస్తారని చెప్పిన అశోక్‌బాబు పంజాగుట్టవద్ద వీదికూలీలకు, ప్రైవేట్‌వ్యక్తులకు పాస్‌లు ముద్రించి ఎలా పంచి పెట్టారో చెప్పగలరాఅనిఆయన నిలదీశారు. ర్యాలీలు నిర్వహించవద్దని, గుంపులుగుంపులుగా రావద్దని కవిూషనర్‌ చెప్పిన సూచనలను సీమాంధ్రులు పాటించారా అని అడిగారు. నిబందనలన్నీ తుంగలో తొక్కినా కూడా ఎందుకు నోరు మెదపడం లేదని అనురాగ్‌శర్మను ప్రశ్నించారు. ఉద్యోగి కాని మిత్ర, గజల్‌ శ్రీనివాస్‌, వంశీకృష్ణ, కారెం శివాజీ తదితరులు సభలోపల వేదికపైకి ఎలా వెల్లారో కమిషనర్‌ చెప్పగలరా అని ప్రశ్నించారు. గజల్‌ శ్రీనివాస్‌ను గేటువద్ద పోలీసులు అడ్డుకుంటే పిఎస్సార్‌ అంజనేయులు అనే డిజి స్థాయి అధికారి ఉన్మాది వీరిని వెంటతీసుకుపోయిన విజువల్స్‌ టీవీల్లో చూశామన్నారు. ఆయనపై ఏం చర్య తీసుకుంటారో శర్మ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పిఎస్సార్‌ ఆంజనేయులు దుర్మార్గాల గురించి విద్యార్థులకు, జర్నలిస్టులకు బాగా తెలుసన్నారు. ఉస్మానియాలో బాష్పవాయు ప్రయోగాలు చేసింది, లేడీస్‌ హాస్టల్‌లో పురుష పోలీసులను పంపించి తుపాకీ మడమలతో తొక్కించిన ఘనమైన చరిత్ర ఈయనగారిదన్నారు. అలాగే మీడియాకు చెందిన వాహనాల్లో మూత్రం పోసి కాల్చివేసిన మహానీయమైన ఉద్యోగి పిఎస్సార్‌ ఆంజనేయులుదన్నారు. హైకోర్టు ఆయన వైఖరిని తప్పుపడుతూ గంటకుపైగా నిలబెట్టిందంటే ఆయనకు చట్టాన్ని ఏవిదంగా అమలు చేస్తే అంతటి శిక్ష విధించి ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఈఅధికారి వ్యవహరించిన తీరుపైన, హైదరాబాద్‌ సభలో నిబందనలను తుంగలో తొక్కిన అంశాలపై పోలీస్‌ కవిూషనర్‌కు చిత్తశుద్ది ఉంటే విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నేడు జరుగుతున్న అన్ని వ్యవహారాలను అతి దగ్గరి నుంచి గమనిస్తున్నామని, తెలంగాణరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ వాదులను ఇబ్బందులకు గురిచేసిన ప్రతి ఒక్కరిని వదిలి పెట్టేదేలేదన్నారు. ఎవ్వరెవ్వరైతే తెలంగాణ భూములను కబ్జాకు గురిచేసుకున్నారో వారిపై తమపోరాటం కచ్చితంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములను తీసుకున్న వారినుంచి ఇంచుభూమి కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంచిపెడతామన్నారు. విూఊరికే వస్తాం విూపైనే దాడి చేస్తాం అంటూ వచ్చినా కూడా తాము ఎంతో సంయమనంతో వ్యవహరించామో బాహ్య ప్రపంచానికి తెలిసిందన్నారు.తమ విద్యార్థుల హాస్టళ్లలోకి వెల్లి పోలీసులు దాడులు చేశారని, సీమాంధ్ర నుంచి వచ్చిన ఉద్యమకారులు తెలంగాణకు చెందిన విద్యార్థినాయకుడిని, యువకుడిని చితకబాదారని, ఉస్మానియాలో మరోసారి బాష్పవాయు ప్రయోగించారని ఇదేనా సీమాంధ్ర ఉద్యోగులు, నాయకులు చెప్పే నీతి అని హరీష్‌ ప్రశ్నించారు. హాస్టళ్లలో ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టడమేకాక నడుం విరగ్గొట్టిన పోలీసుల వ్యవహారంపై కోర్టు దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎలాంటి విద్వంసాలు జరుగకుండా చూస్తామని కోర్టుకు పోలీసులకు హామీ ఇచ్చిన అశోక్‌బాబు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని హరీశ్‌రావు ప్రశ్నించారు. దాడులు చేసినా కూడా తాము ప్రశాంతంగానే ఉన్నామన్నారు.
ఏపీఎన్జీఓల సభలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఓ కానిస్టేబుల్‌ను సీమాంధ్రకు చెందిన పోలీసులు అతనిపై చితక బాదడమేకాక బయటకు తీసుకెల్లారు. ఈఘటనను అడ్డుకున్న తెలంగాణ పోలీసులపై సీమాంధ్ర ఉద్యోగులు విరుచుకుపడ్డారు. సీమాంధ్ర పోలీసు అదికారులు కానిస్టేబుల్‌ను దాడి చేశారు. ఈక్రమంలో సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు చేరుకుని తమకు అప్పగించాలని పట్టుపట్టారు. అయితేవారిని సీమాంధ్ర పోలీసులు వెల్లగొట్టడమేకాక, నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ను వేదిక క్రింది బాగానికి తీసుకెళ్లారు. వేలాదిమంది సమక్షంలో ఓకానిస్టేబుల్‌ తెగించి జై తెలంగాణ నినాదాలిచ్చాడంటేనే ఆయన దైర్యానికి హ్యాట్సప్‌ అన్నారు తెలంగాణ వాదులు. ఓచానల్‌ డిబేట్‌లో పాల్గొన్న దేశపతి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌రెడ్డి తదితరులు స్పందించి కానిస్టేబుల్‌ హ్యాట్సప్‌ చెప్పారు. ఈ సంఘటనను చూసిన దేశ్‌పతి శ్రీనివాస్‌ కంటతడి పెట్టారు. అన్నా నీకు దండమే పోలీసన్న నీకు దండమే అంటూ గేయాన్ని ఆలపించారు. పోలీసులు, సీమాంధ్ర ఉద్యోగులపై తీవ్రంగామండిపడ్డారు. తెలంగాణ బిడ్డలను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. నడుములు విరగొట్టి, గుండెలపై తొక్కడమే సీమాంధ్ర సంస్కృతా అని దేశ్‌పతి ప్రశ్నించారు. తాము పోరాటాలు చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణా తెచ్చుకున్నామన్నారు. సిఎం, డిజిపిలు కలిసి వచ్చినా కూడా ఆపలేరన్నారు. అడ్డుకుంటే మాత్రం మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని రుచిచూపిస్తామన్నారు. తెలుగు జాతి అంటూ నోరు విప్పి మాట్లాడుతున్న పార్టీలు కానిస్టేబుల్‌పై దాడిచేసిన పోలీసుల వైఖరి, ఉస్మానియా విద్యార్థినేతను, నిజాం కళాశాలలో హాస్టల్‌పైనుంచి విద్యార్థిని తోసేసి నడుం విరగ్గొట్టిన సంఘటనలపై ఏం మాట్లాడుతారని నిలదీశారు. శ్రీదర్‌రెడ్డి మాట్లాడుతూ ఆనాడు మద్రాస్‌ వాళ్లు ఆంద్రావాల్లను కనీసం ఒక్కపూట కూడా ఉండనీయమని తరిమి కొట్టారన్నారు. సీమాంధ్రులు ఇంకా అడ్డుకుందామంటే తెలంగాణ వారు కూడా హైదరాబాద్‌ను పదిసంవత్సరాలు కాదు కదా ఒక్కరోజు కూడా ఉండనీయమనే పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ వాదులుకూడా పునరాలోచించుకునే పరిస్థితి తీసుకు రావద్దన్నారు.
హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లకే రక్షణ కరువైందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభకు వచ్చిన ఏపీఎన్జీవోలు తెలంగాణవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాగైతే పదేళ్లు కూడా కలిసి ఉండడం కష్టమని చెప్పారు. టీఎంపీలు పొన్నం ప్రభాకర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులతో కలిసి పాల్వాయి శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సభకు విచ్చిన ఏపీ ఎన్జీవోలు ఓయూ విద్యార్థి బాలరాజు యాదవ్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణవాదులపై దాడులు చేస్తూ తమకు రక్షణ కావాలని కోరడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఓయూ, నిజాం కాలేజీల హాస్టళ్లలోకి పోలీసులు చొరబడి దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని సీఎం కిరణ్‌, ఆంధ్ర పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా, హైకమాండ్‌ నిర్ణయాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ పెద్దలు అహ్మద్‌ పటేల్‌, చిదంబరంలను కోరామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేలా ముందుకు వెళ్లాలని అహ్మద్‌ పటేల్‌ను కోరామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాగైతే పదేళ్లు కలిసి ఉండడం కష్టమేనని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌తో చెలగాటలాడొద్దు: అంజన్‌
సీమాంధ్రులు హైదరాబాద్‌తో చెలగాటాలాడొద్దని సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌ తమ తాత, ముత్తాతల రక్తమాంసాలతో నిర్మితమైనదని, దాని జోలెకొస్తే ఖబర్దార్‌ అని హెచ్చరించారు. హైదరాబాద్‌ తమది అని వాగ్వాదం చేస్తే అగ్నిగుండం సృష్టిస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం వేలాది మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారని.. వారి ఆత్మబలిదానాల వల్ల వచ్చిన తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్రులు ప్రయత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థుల బలిదానాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర సభలకు కిరణ్‌ సర్కారు సెక్యూరిటీగార్డుగా పని చేస్తోందని ఎద్దేవా చేశారు. పాన్‌డబ్బాలు మావి.. ఫైవ్‌ స్టార్‌ ¬టళ్లు విూవి అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే బడగులు, బలహీనవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ వాదులపై సీమాంధ్ర నేతలు, పోలీసులు దాడులు చేస్తుంటే.. తెలంగాణ ప్రాంత పోలీసులు ఏం చేస్తున్నారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఇప్పటికైన తెలంగాణ పోలీసులు కళ్లు తెరవాలని కోరారు. మన బిడ్డలపై దాడులు చేస్తుంటే విూరేలా చూస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్ర అధికారుల కనుసన్నల్లోంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు బయటకు వచ్చి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కోరారు.