హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్ర
బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ ఆరోపణ
తిరుపతిలో అంతర్జాతీయ ఇస్లామిక్ వర్సిటీని నిలిపివేయాలని డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబరు, 13 : హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను ప్రభుత్వం అడ్డుకోలేక పోతోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎంవీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల, తిరుపతిని హిందువులు పవిత్ర ప్రాంతంగా పూజిస్తారని ఆయన తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న అన్ని విషయాలను ఇస్లామిక్ దేశాలు సేకరిస్తున్నాయని ఆరోపించారు. హిందువుల మనోభావాలను, తిరుపతి పవిత్రను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో మదర్సాలను ఏర్పాటు చేసుకుందామని భూములు కొనుగోలు చేశామని కొన్ని ఇస్లామిక్ సంస్థలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తిరుపతిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయ నిర్మాణం అనుమతి లేకుండానే కొనసాగుతుందని ఆరోపించారు. విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన భూములు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చర్చిలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు ఇస్లామిక్ విశ్వవిద్యాలయం నిర్మాణం వెనుక ఉన్న పెద్దల బాగోతం బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక చిన్న సంస్థకు వివిధ దేశాలలో బ్రాంచీలు ఎలా ఉన్నాయని, భూ సేకరణ ఎలా జరిగిందని ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రలో కాంగ్రెస్ పావుగా మారిందని ఆయన విమర్శించారు. ఈ విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన భూమిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని నిర్మాణాన్ని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.



