-->

కోర్‌ కమిటీలో తెలంగాణపై చర్చ


పది జిల్లాల తెలంగాణే
కేబినెట్‌ ఆమోదానికి నోట్‌
విధివిధానాలు మంత్రుల బృందమే నిర్ణయిస్తుంది
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో శుక్రవారం చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతల అభ్యంతరాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను శుక్రవా రం కోర్‌ కమిటీకి అందజేసింది. ఆంటోనీ కమిటీ అందజేసింది ప్రాథమిక నివేదికేనని, ఇరు ప్రాంతాల పార్టీ నేతలు ఇచ్చిన విజ్ఞప్తులు, స్థానిక స్థితిగతులపై మరింత సవివరమైన నివేదికను త్వరలోనే అందజేస్తారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీకి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థిక మంత్రి చిందంబరం, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంత నేతల్లో అసంతృప్తి, అక్కడ జరుగుతున్న ఉద్యమం, హైదరాబాద్‌లో ఇటీవల ఏపీఎన్‌జీవోలు నిర్వహించిన సభ, ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను ఆంటోనీ తన ప్రాథమిక నివేదికలో ప్రస్తావించినట్లుగా సమాచారం. వీటిపై విపులంగా చర్చించిన కోర్‌ కమిటీ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆంటోనీ కమిటీ కోర్‌ కమిటీకి నివేదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన నోట్‌ సోనియాగాంధీకి గురువారమే అందజేసినట్లు సమాచారం. కాగా ఆ నోట్‌లోని అంశాలనూ కోర్‌ కమిటీ చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి లాభమా? నష్టమా? తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది? ముఖ్యమంత్రి సహా మంత్రులు, పార్టీ ముఖ్యులు కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారడంలో నిజానిజాలు తదితర అంశాలపై కోర్‌ కమిటీలో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోనే సీమాంధ్ర ప్రాంతంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సహాన్నాహాలు జరుగుతున్నట్లు ఉన్న ఊహాగానాల్లో నిజానిజాలను అధ్యయనం చేయడానికి పార్టీ ఆంతరంగికులకు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు తెలంగాణ ఇచ్చి తీరాలని సోనియాగాంధీ నిశ్చిత అభిప్రాయం వ్యక్తం చేయడంతో కోర్‌ కమిటీ సభ్యులు ఈమేరకు తదుపరి చర్యలు ప్రారంభించేందుకు ఉద్యుక్తమవుతున్నారు. వీలైతే శనివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్‌ ముందుకు తెలంగాణ నోట్‌ను తీసుకువచ్చి దానికి మంత్రి మండలి ఆమోదం తెలిపేలా చర్యలు వేగవంతం చేశారు. టీ నోట్‌కు కేబినెట్‌ ఓకే చెప్పగానే ఆ నోట్‌ న్యాయశాఖ పరిశీలనకు అటు తర్వాత మిగతా ప్రక్రియ ప్రారంభించాలని కోర్‌ కమిటీ భావిస్తోంది. కేబినెట్‌ ఏర్పాటు చేసే మంత్రుల బృందం తెలంగాణపై అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిలో సహేతుకంగా ఉన్న వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయానికి చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు పాటించాల్సిన విధివిధానాలను కూడా మంత్రుల బృందమే ఖరారు చేసేలా కాంగ్రెస్‌ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు ఎంతగా ఒత్తిడి తెచ్చినా తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదని మేడమ్‌ స్పష్టం చేయడంతో అలాంటి చర్చకు అవకాశమే లేదని వారు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ కొంత కాలం ఉమ్మడి రాజధాని ఉంచడం మినహా యూటీ లాంటి ప్రదిపాదనలు కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ఎదుట లేవని తెలిసింది.