పరిస్థితులను చక్కదిద్దండి

సీఎంకు అధిష్టానం ఆదేశం
లేదంటే నాయకత్వ మార్పుపై
దృష్టి సారించాల్సి వస్తుందని హెచ్చరిక
హైదరాబాద్‌, సెప్టెంబరు 15 : రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దగలవా, లేక నాయకత్వం మార్పు దృష్టి పెట్టాలా అంటూ  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో సీఎం కూడా భవిష్యత్‌ కార్యాచరణపై అప్పుడే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆందోళనలను చల్లార్చి, స్తంభించిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ, సీమాంధ్రల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడం, పార్టీ శ్రేణులను సిద్దం చేయడంవంటి అతి కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు సమాచారం. ఉద్యోగుల సమ్మెను విరమింపజేయడం.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కించడం, తెలంగాణ, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణాన్ని చల్లార్చడం వంటి పటిష్ట కార్యాచరణతో సీఎం ముందకెళ్లాలని నిర్ణయించారు. పాలనపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షించే దిశగా సీఎం అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో వనరులు, ఆస్తులు ఆదాయ పంపిణీలపై ఇరుప్రాంతాల మధ్య ఒప్పందాలు చూడాల్సిన బాధ్యత కూడా అధిష్టానం సీఎంకు అప్పగించినట్లు తెలుస్తోంది. సమస్యలున్న అంశాలను గుర్తించడం.. వాటి పరిష్కారమార్గాలను కనుక్కోవడం.. ఇరుప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ఒప్పందాలను కుదర్చడంలో కిరణ్‌ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన వ్యవహారంలో సమన్యాయం అనే పదానికి అర్థం కూడా ముఖ్యమంత్రి సిద్దం చేసినట్లు తెలిసింది. అప్పులు, ఆస్తులు, నీళ్లు, నిధులు, ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా హైదరాబాద్‌ అంశంపై ఉన్న ఇబ్బందులను కిరణ్‌ అధిష్టానానికి కొన్ని అంశాలను ఇప్పటికే వివరించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఖరిలో స్పష్టత వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని అమలు పరచడం సాధ్యం కాదని, ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. అయినా అధిష్టానం కిరణ్‌ వైఖరిపై పెద్దగా స్పందించలేదు. అయితే అంతర్గతంగా మాత్రం సీఎంకు పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా సొంత అభిప్రాయాలున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం తప్పని కూడా మందలించినట్లు తెలిసింది. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని సీఎంకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల వైఖరి ఎండగట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రకటన చేసిందని ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని ఆ రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని   ఎదురుదాడి  చేయాలని సీఎం నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా కాంగ్రెస్‌ అధిష్టానం సూచన మేరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుంబిగించినట్లు తెలుస్తోంది.

తాజావార్తలు