‘విభజన’ పనిలో కిరణ్‌ సర్కార్‌!

కొత్త రాష్ట్రాల నుంచి సమాచారం సేకరణ
పన్నుల రాబడి, అప్పులపై తర్జనభర్జన
ఎక్సైజ్‌ ఆదాయంపైనా లెక్కలు
ఉద్యోగుల, వనరుల కేటాయింపుపై దృష్టి సారింపు
కేంద్రం ఆదేశాలతో బిజీబిజీగా సీఎం!
హైదరబాద్‌, సెప్టెంబర్‌ 16 : రాష్ట్ర విభజన ఏర్పాట్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తలమునకలైనట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే విభజన పనులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు  అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఓ పక్క ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు వినికిడి. ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి ఏర్పాట్లను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర విభజనలో వనరుల కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం. మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్య వివరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రాష్ట్రాలకు ఏఏ అంశాలను ఏ విధంగా కేటాయింపులు జరపాలనేదానిపై ఉన్నతాధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి అవసరమైన పలు అంశాలపై ఢిల్లీకి చెందిన ఐఐటీ సంస్థ చేపట్టిన అధ్యయనాన్ని కూడా రాష్ట్ర సర్కార్‌ పరిశీలిస్తున్నట్టు వినికిడి. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసీ, యూపీఏ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ రూపొందించిన నోట్‌ ఆధారంగానే కిరణ్‌ సర్కార్‌ చర్యలు చేపడుతున్నట్టు సమాచారం.  దేశ వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన కొత్త రాష్ట్రాల  నుంచి సమాచారం సేకరించే పనిలో రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే కిరణ్‌ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. దీనికి స్పందించిన ఆ ప్రభుత్వం పలు వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్రానికి ఇటీవల పంపినట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం  తీసుకున్న చర్యల గురించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. విభజన సమయంలో చర, స్థిరాస్తులతోపాటు ప్రభుత్వానికి వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పులు, రుణాలను కొత్త రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన కేటాయింపులు జరపాలనేదానిపై అనుసరించే విధానాలు, పద్ధతులను గురించి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సమాచారంలో ప్రధానంగా ఉన్నాయి.

అదే విధంగా విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా వర్తింపజేసేందుకు కిరణ్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఉన్నతాధికారుల వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఆయా ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకే చెందేటట్లు ఒప్పందం చేసుకున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా వర్తింపజేస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపై ప్రభుత్వ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యేక ప్యాకేజీ అందకపోవడంతో రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం నుంచి 550 కోట్ల రూపాయల మేర ఆర్థిక నిధులు పొందినట్టు సమాచారం. కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు 5వేల కోట్ల రూపాయల అవసరం ఉంటుందని,  250 హెక్టార్ల భూమిలో అసెంబ్లీ, ఉద్యోగుల నివాస సముదాయాలు వంటి వాటికి అవసరం ఉంటుందని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అంచనా వేసింది.  సీమాంధ్ర రాష్ట్రానికి ప్రస్తుతం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటే ఇక్కడ కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నుంచి విధులు వచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు ఒక అంచానాకు వచ్చినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగుల విభజన ఏ విధంగా జరపాలనేదానిపై కూడా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే అనుసరించే అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా ఢిల్లీకి చెందిన ఐఐటీ సంస్థకు చెందిన నిపుణులు హైదరాబాద్‌ నగరం, దానికి వస్తున్న ఆదాయం వంటివాటిపై జరుపుతున్న  అధ్యయన ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ అధ్యయనంపై రూపొందించనున్న నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తాజావార్తలు