శవాలపై పేలాలు..
శవాలపై పేలాలు..
తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు సీమాంధ్రుల సైబర్ మోసం
మానవత్వం మరిచి డబ్బులు దండుకున్న వైనం
బెజ్జంకి, సెప్టెంబర్ 20 (జనంసాక్షి) :
సీమాంధ్రులు శవాలపై చిల్లర ఏరుకుంటున్నారు… తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్న ఓ వ్యక్తి కుటుంబానికి టోకరా వేసి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారు. కాసుల కోసం కక్కుర్తిపడి మానవత్వాన్ని మరిచారు.. ఇన్నాళ్లు.. నీరు.. వనరుల దోపిడీకి తెగబడి.. ఇప్పుడు అమరుల కుటుంబాలను సైతం పీక్కుతింటున్నారు.
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కొత్తపల్లికి చెందిన కౌడగాని నవీన్‌కుమార్ ఇటీవల తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కుటుంబానికి కొందరు టోకరా వేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
బెజ్జంకి మండలం కొత్తపల్లికి చెందిన కౌడగాని నవీన్‌కుమార్ ఈ నెల 14న తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి తండి కౌడగాని శ్రీనివాస్‌కు సోమవారం సీమాంధ్రకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాము తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థికసాయంగా రూ. 50వేలు అందిస్తున్నామని, మీరు కూడా వచ్చి డబ్బులు తీసుకెళ్లాలని చెప్పారు. మాకు ఇప్పుడు రావడం వీలు కాదని అతడి తండ్రి చెప్పగా ఫోన్ కట్‌చేశారు. తర్వాత తిరిగి బుధవారం మళ్లీ ఫోన్ చేశారు. రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచామని, మీరు తీసుకోవడంలో ఆలస్యం చేశారని, ఇందుకు మీరు రూ. 16 వేలు తమ అకౌంట్ (ఎస్‌బీఐ 20139869247)లో వేయాలని సూచించాడు. దీంతో మృతుని తండ్రి శుక్రవారం స్థానిక గుండ్లపల్లి ఎస్‌బీఐ శాఖలో రూ. 16 వేలు జమచేశాడు. ఐదు నిమిషాలలో రూ. లక్ష జమ అవుతాయని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో మృతుని తండ్రి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజరును సంప్రదించగా ఆ అకౌంటు వైజాగ్‌కు చెందిన అప్పలనాయుడిదని, అతడి ఫోన్‌నంబరును ఇచ్చారు. ఆ నంబరుకు ఫోను చేయగా సదరు వ్యక్తి మాట్లాడుతూ తాను లాడ్జిలో పనిచేస్తానని, కిరణ్ అనే ఒకవ్యక్తి తన స్నేహితుడు డబ్బులు పంపిస్తాడని, దానికి తన అకౌంటు నంబరును ఇవ్వమని కోరగా ఇచ్చానని, డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిపోయాడని, తనతో నాకు ఎలాంటి సంబంధం లేదని వివరించాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితుడు టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును కలిసి ఈ విషయాన్ని వివరించారు. దీంతో ఆయన అప్పలనాయుడికి ఫోన్‌చేసి వివరాలను కనుగొని బాధితునికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.