మే 7 తర్వాతే మునిసిపల్‌ ఫలితాలు


సార్వత్రిక ఎన్నికలపై స్థానిక ఫలితాలు ప్రభావం చూపుతాయి

ఈవీఎంలు భద్రపరచలేమని ఈసీ అనడాన్ని తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 7 తర్వాతే మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాకే మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిం చింది. గతంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది. ఇదిలావుంటే రాష్ట్ర ఎన్నికల సంఘంపై న్యాయ స్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంలు ఎక్కువ రోజులు ఉంచడం వల్ల అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈసీ పేర్కొన గా అలాంటి కారణాలు చెప్పవద్దని న్యాయస్థానం అసహనం వ్యక్తంచే సినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు సరిపోవని చెప్పగా ఈవీఎంలు తగినన్ని ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. సాధారణ ఎన్నికలపై మున్సిపల్‌ ఫలితాల ప్రభావం ఉంటుం దన్న పిటిషనర్ల వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది. పరిషత్‌ ఎన్నికల్లో ఒక వైఖరి, మున్సిపల్‌ ఎన్నికల్లో మరో వైఖరా అని న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీఅంతో ఫలి తాల విడుదలకు మరో నెలరోజులు ఆగాల్సి ఉంటుంది. ఇదిలావుంటే గతనెల 30న ఎన్నికలు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలను చూపి ఫలితాలను వాయిదా వేయలేమని అడగవద్దని తెలిపింది. కాగా, సుప్రీం కోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తాము కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటామని చెప్పింది. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వాయిదా వేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ పైన సుప్రీం కోర్టు, హైకోర్టులలో విచారణ జరిగింది. హైకోర్టు ఈ నెల 9వ తేదీలోగా ఫలితాలు విడుదల చేయాలని చెప్పగా.. ఇటీవల సుప్రీం కోర్టు స్టే విధించింది. మే 7 తర్వాతనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఇవిఎంలకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.