పై-లిన్ మహా ఉగ్రరూపం
గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకిన తుపాను
ఆంధ్రా, ఒడిశాపై పెను ప్రభావం
పదుల సంఖ్యలో మృతులు
5.55 లక్షల మంది నిరాశ్రయులు
8 రాష్ట్రాలపై ప్రభావం
18 హెలికాప్టర్లు, 12 విమానాలతో సహాయక చర్యలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (జనంసాక్షి) :
బంగాళాఖాతంలో ఏర్పడిన పై-లిన్ తుపాన్ మహా ఉగ్రరూపాన్ని సంతరించుకుంది. శనివారం సాయంత్రం రూ.6.25 గంటలకు ఒడిశా తీర ప్రాంతంలోని గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకింది. తుపాను బీభత్సానికి ఒడిశా రాజధాని భువనేశ్వర్ సహా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఐదు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పై-లిన్ తుపాను ప్రభావం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 18 హెలికాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధ నౌకల ద్వారా సహాయక చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చోట వీటిని మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో 5.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఒడిషాలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో పైలిన్ ప్రభావం ఎక్కువగా ఉందని అంచనా వేశామని, ఆయా ప్రాంతాల్లో 500 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పైలిన్ బాధితుల్ని ఆదుకునేందుకు సాధ్యమైనంత వరకు సహాయక చర్యల్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ శాఖలను ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభావ రాష్ట్రాలకు సహకారమందించాలని సూచించారు. ప్రజల భద్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు. విదేశీ పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి తిరిగివచ్చిన ప్రధాని పైలిన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
పైలిన్ తుపాన్ కారణంగా ఢిల్లీ-భువనేశ్వర్ మధ్య రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైళ్లను అలాగే భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లను నిలిపివేసినట్టు ఉత్తరాది రైల్వే శనివారం ప్రకటించింది. ఆదివారం బయల్దేరాల్సిన ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (నం.22812), ఈనెల 14న న్యూఢిల్లీ-పూరి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ (నం.12802), న్యూఢిల్లీ-పూరినందన్ కణ్నన్ ఎక్స్‌ప్రెస్ (నం.12816), న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (నం.22806)ను రద్దు చేశారు. అలాగే 15న బయల్దేరాల్సిన హరిద్వార్-పూరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూర్ మండలం బెండి వద్ద పై-లిన్ తుపాను తీరం దాటింది. ఆరు గంటలకు పాటు తుపాను తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోపాల్‌పూర్, బెండి వద్ద గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.శ్రీకాకుళం జిల్లాలో సుమారు 60 గ్రామాలకు పైగానే గ్రామాలు తుపపాను కారణంగా అవస్థలకు గురవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్దసముద్రం సుమారు 50 మీటర్ల వరకు ముందుకు తోసుకు వచ్చినట్లు అదికారులు గుర్తించారు. దీంతోచాలా మంది అవస్థలు పడుతున్నారు. తుఫాన్‌ప్రభావిత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు శుక్రవారం రాత్రినుంచే రంగంలోకి దిగారు. సవిూప పట్టణాల్లో నెలకొల్పిన పునరావాస కేంద్రాల్లోకి తరలిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తదితర జిల్లాల్లో గతరాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం రాత్రి భోజనం కూడా సరఫలా చేశారు అధికారులు. ఎక్కడా కూడా లోటు లేకుండా అధికారులు చూస్తున్నా రు. పునరావాస కేంద్రాలకు చేరిన వారు సైతం దాదాపుగా సంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, బోగాపురంతో పాటు 23 గ్రామాల్లో సైతం సముద్రం సుమారు 40 అడుగులు ముందుకు దూసుకు వచ్చినట్లు గుర్తించారు.
అలాగే అలల ప్రభావం కూడా మూడునుంచి ఆరు విూటర్ల ఎత్తుకు ఎగిసి పడుతుండడంతో ప్రజలు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెల్లకుం డా హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతం అంతా ప్రమాద హెచ్చరిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. కళింగ పట్నానికి 314 కిలోవిూటర్లు, గోపాల్‌పూర్‌కు 315, పారాదీప్‌కు 355 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో అతివేగంగా అలలు పైకి ఎగిసి పడుతాయన్నారు. అంతే కాక వాతావరణంలో మార్పుల కారణంగా కమ్యూనికేషన్ల రంగంపై కూడా ప్రభావం చూపించనుందని పేర్కొంటున్నారు. సముద్ర తీరం ఉన్న జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి సహాయక చర్యలను చేపడుతున్నారు.
తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. వాటి ఫోన్ నంబర్లు :
శ్రీకాకుళం : 0894-2240557/9652838191
విశాఖపట్టణం : 1800425002
విజయనగరం : 0892-22365506, టోల్ ఫ్రీ : 1077
తూర్పుగోదావరి : 0884-2365506-0884 – 1077
అమలాపురం ఆర్డీవో కార్యాలయ కంట్రోల్ రూమ్ : 08856-233100
ఇండియన్ కోస్ట్‌గార్డ్ : 1554, మెరైన్ పోలీసు : 1093
పశ్చిమ గోదావరి : 0881230617
కృష్ణా : 086722525, టోల్ ఫ్రీ : 1077
గుంటూర్ జిల్లా : 08644 223800, 0863 2345103/0863 2234990
తెనాలి : 08644 223800
నెల్లూరు : 1800 425 2499, 08612, 331477