సీమాంధ్ర నేతలు సమైక్యంగా ఉంచాలంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి వినతిపత్రం ఇవ్వడం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియకుండానే జరిగిందా? బాబుకు తెలియకుండానే వాళ్లు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ తీసుకోగలిగారా? అసలు రాష్ట్రపతిని కలిసే బృందంలో బాబు కూడా ఉంటారని వార్తలు వచ్చిన చివరి నిమిషంలో ఆయన ఎందుకు ఆగిపోయారు? తమ అధినేత సమన్యాయాన్ని కోరుకుంటున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్న టీ టీడీపీ నాయకులకు ఇవేమీ తెలియవా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ప్రజల మదిని తొలిచేస్తున్నాయి. తెలంగాణ విషయంలో మొదటి నుంచి అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న పార్టీ టీడీపీ. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న నాయకుడు చంద్రబాబునాయుడు. సోమవారం రాత్రి ఆయన పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు రాష్ట్రపతిని కలిసి విభజన ఆపాలని కోరితే బాబు ఇంకో అడుగు ముందుకేసి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశాడు. మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకునే వరకూ విభజన ఆపాలని కోరాడు. ప్రస్తుతానికి విభజన గండం గట్టెక్కితే ఇక ఎప్పటికీ తెలంగాణ ఏర్పాటు కాదనే దుష్టబుద్ధితోనే బాబు ప్రధానికి లేఖ రాశాడు. సమన్యాయం చేయలేనప్పుడు విభజన ప్రక్రియ నిలిపివేయాలని కోరిన చంద్రబాబుకు టీ టీడీపీ నేతలు ఇప్పటికీ బానిసల్లాగే ప్రవర్తిస్తున్నారు. తమ అధినేత ప్రజలకు సమన్యాయం చేయాలని కోరుతున్నారని టీ టీడీపీ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అంటున్నాడు. ఇరు ప్రాంతాల జేఏసీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాతే విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరుతున్నాడని ఎర్రబెల్లి చెప్పుకొచ్చాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు చేసిన ఉద్యమాలను, విద్యార్థులు, యువత బలిదానాలను విస్మరించి టీ టీడీపీ నేతలు చంద్రబాబు పల్లకీ మోస్తున్నారు. ఎన్నో త్యాగాలు, మరెన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్రులు గద్దల్లా తన్నుకుపోతున్నా, అందుకు చంద్రబాబులాంటి పెట్టుబడిదారి ఏజెంట్లు వత్తాసు పలుకుతున్న టీ టీడీపీ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. అంతే కాదు ఆయన అడుగులకు మడుగులొత్తుతోంది. టీ టీడీపీ చేస్తున్నది చారిత్రాత్మక తప్పిదం అయినా చంద్రబాబు రాజకీయం మాటున సమర్థించుకునే పనిచేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తాత్కాలికంగా ఆపాలని ప్రధానికి లేఖ రాసిన బాబు వెనుక టీ టీడీపీ నేతలు నడవడమంటే తెలంగాణ ప్రజలను వంచించడం కదా? వారికి ఓట్లేసిన పాపానికి తమ హక్కులు బలిపెడుతున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? టీడీపీ, చంద్రబాబు చెప్తున్న సమన్యాం అంటే ఏమిటీ? అసలు ఆ పదానికి అర్థమేమైనా ఉందా? టీడీపీ ఏదైనా కొత్త డిక్షనరీ సృష్టించి అందులో సమన్యాయం అదే పదానికి అర్థాన్ని రాస్తుందా? చంద్రబాబు సీమాంధ్ర పక్షపాతి అనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది.. అయినా ఆయన్నే పట్టుకు వేల్లాడం, ఈ క్రమంలో తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయడం ఎంత వరకు సమంజసం. తెలంగాణ విషయంలో ఇచ్చిన హామీని తప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ చంద్రబాబు మాత్రం ఇరుప్రాంతాల్లో పార్టీ ఉనికిని కోరుకుంటున్నారు. రెండు ప్రాంతాల్లో ఓట్లు, సీట్ల ద్వారా తనకు రెండు పర్యాయాలు అందకుండా పోయిన అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని యత్నిస్తున్నాడు. అందుకోసం తెలంగాణ నేతలతో తెలంగాణ ప్రజల హక్కులను పణంగా పెట్టించజూస్తున్నాడు. ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ అనే మాటే వినిపించద్దని హూంకరించిన చంద్రబాబు తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు అనుకూలమన్నట్టు నటించాడు. తీరా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే వేళ మోకాలడ్డుతున్నాడు. తెలంగాణపై పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డామంటూనే ఇప్పటికిప్పుడే విభజన వద్దంటున్నాడు. సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లి తెలంగాణ ఏర్పాటును తానే అడ్డుకున్నానని చెప్పాడు. ఢిల్లీలో దొంగ దీక్ష చేసి జాతీయ మీడియాకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడేమో ఇప్పటికే ఇప్పుడు విభజన వద్దంటున్నాడు. అసలు తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరేంటో చెప్పకుండా, విభజన వద్దనే వారిని రాష్ట్రపతి వద్దకు పంపి తెలంగాణ కోరుకునే వారిని మాత్రం అదిరింపులు, బెదిరింపులతో హద్దుల్లో పెట్టాలనుకోవడం చంద్రబాబు నిరంకుశ వైఖరికి నిదర్శనం. తెలంగాణ ప్రజలు ఈ గడ్డపై అడుగు కూడా పెట్టకుండా తరిమి తరిమి కొడితే చంద్రబాబు తెలంగాణకు అనుకూలమన్నాడు. 2009 డిసెంబర్‌ 9న కేంద్రం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటూ అప్పటికప్పుడే అడ్డం తిరిగి తెలంగాణ ఏర్పడకుండా చేశాడు. తెలంగాణ విషయంలో మొదటి నుంచి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న చంద్రబాబు, ఆయన పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎందుకుండాలి అనే చర్చ సాగుతున్న సమయంలోనూ టీ టీడీపీ నేతలు చంద్రబాబు విసిరే ఎంగిసి బెస్కట్లకు తోక ఊపుతూ నిల్చుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష, నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రమే అయినప్పుడు ఇంకా సమన్యాయమనే దానికి అర్థమేమైనా ఉందా? న్యాయం, అన్యాయం అనేవి మాత్రమే ఉంటాయి.. సమన్యాయం అనేది ఎక్కడా ఉండదు. అయినా ఉండని సమన్యాయాన్ని అర్థం లేని సమన్యాయాన్ని చంద్రబాబు కోరుకోవడం, దానిని టీ టీడీపీ వత్తాసు పలకడం ఏమిటీ? అంటే తెలంగాణ ప్రజలను మోసం చేసి, వంచించి ఇచ్చిన తెలంగాణలో నుంచి కొంత సీమాంధ్రులకు రాసివ్వడమా? అదే సమన్యాయమని చంద్రబాబు చెప్తారా? అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన న్యాయం ఏమిటీ? టీ టీడీపీ ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చంద్రబాబుతో పాటు టీ టీడీపీని తెలంగాణ ద్రోహుల్లాగే ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. బాబు విభజన వద్దన్నాక కూడా నోరు విప్పకపోతే అంతకుమించిన ద్రోహం మరొకటి ఉండదు.