పటేల్ నూరుపాళ్లు లౌకికవాది
దేశానికి జవహర్‌లాల్‌నెహ్రూ కన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక మొదట ప్రధాన మంత్రి అయి ఉంటే దేశం మరింత పురోగామి దశలో ఉండేదని ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ నెహ్రూకు, పటేల్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఉండేవని, వాటికి ఇవిగో రుజువులంటూ ట్విట్టర్‌లో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పటేల్‌పైనే చర్చ సాగుతోంది. మొండివాడిగా, కరుకుమనిషిగా పేరున్న పటేల్ కనుక దేశానికి మొదటి ప్రధాని అయి ఉంటే ఇప్పటికీ పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు అప్పుడే పరిష్కారం చూపేవారనేది కొందరి అభిప్రాయం. ఈ అభిప్రాయంతోనే నెహ్రూ కన్నా పటేల్ ప్రధాని అయి ఉంటే బాగుండేదని చాలా మంది అంటుంటారు. ఆ వ్యాఖ్యలను అలా ఉంచితే సర్దార్ పటేల్ హిందుత్వవాది అని ఇటీవల కాలంలో బీజేపీ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆయన గుజరాత్‌కు చెందిన వారు కాబట్టి అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ పటేల్‌కూ మతం రంగు పులిమి దాని ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాడు. దేశప్రజలను నిలువునా చీల్చే దుష్ట రాజకీయాలకు మోడీ నాంది పలికితే అద్వానీ దాన్ని కొనసాగిస్తున్నారు. తమ పార్టీ పరంగా ప్రారంభించిన వాదనకు బలం చేకూర్చేందుకు ఆయన పాత పుస్తకాలను తిరగేయడంతో పాటు పటేల్‌కు సన్నిహితంగా వ్యవహరించి ఇప్పటికీ జీవించి ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ఆయనకు నెహ్రూకు చాలా విభేదాలుండేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నెహ్రూ కుటుంబం గుత్తాధిపత్యంలోనే ఉందని, మంచినేతలను అభివృద్ధి చెందకుండా అణచేశారని చిత్రీకరించేందుకు భాజపా విఫలయత్నాలే చేస్తోంది. అందుకే పటేల్‌కు మతం రంగు పులిమింది. ఆయన భారత్, పాక్ విభజనను వ్యతిరేకించారని చెప్పేందుకు ఎంతకైనా తెగిస్తోంది. నిజానికి భారత్, పాకిస్తాన్ విభజన సమయంలో పటేల్ స్పష్టమైన నిర్ణయమేది ప్రకటించలేదు. పైపెచ్చు మౌనం వహించాడు. మౌనంగా ఉండటమంటే జరుగుతున్న దానికి ఆమోదం తెలపడమే అవుతుంది. వ్యతిరేకత ఉంటే బహిరంగా వ్యక్తపరచవచ్చు. పటేల్ మొదటి నుంచి తన ఇష్టాఇష్టాలను స్వేచ్ఛగా వెల్లడించే స్థాయిలో ఉండేవారు. కానీ ఆయన దేశ విభజన సమయంలో మౌనం వహించడం అంటే అందుకు సమ్మతించడమేనన్నది నిజం. భారత్, పాకిస్థాన్ విభజన అనంతరం పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులను ఆయన ఖండించారు. భారతదేశ హోం మంత్రిగా కొద్దికాలం వరకు కలిసి ఉన్న భూభాగంలో జరిగిన దుర్మార్గాన్ని ఆయన ప్రశ్నించాడు. కానీ ఆయన ఎప్పుడూ హిందూ మత పక్షపాతిగా మాత్రం వ్యవహరించలేదు. పటేల్‌కు హిందుత్వ భావజాలం ఉండటం వల్లే మహాత్మాగాంధీ ఆయనను కాకుండా నెహ్రూ ప్రధాని కావాలనుకున్నారనేది మరో వాదన. గాంధీజీ మత సామరస్యాన్ని కోరుకున్న వ్యక్తే కావడం వల్ల కాస్త దూకుడుగా వ్యవహరించే పటేల్‌ను కాకుండా హిందూ, ముస్లింలతో సత్సంబంధాలు నెరపగల నెహ్రూకు మద్దతు ఇచ్చారని ఆయనకు సన్నిహితంగా ఉండేవారు చెప్తారు. గాంధీజీ, పటేల్ ఇద్దరూ గుజరాత్‌కు చెందిన వారే అయినా సొంత రాష్ట్రానికి చెందిన పటేల్‌ను కాదని, నెహ్రూకు గాంధీ మద్దతు తెలపడం వెనుక ఆయన హిందుత్వవాదమే కారణమనే అంచనాలకు ప్రాతిపదిక లేదు. ఒకవేళ పటేల్ కనుక హిందుత్వ వాదే అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై నిషేధం విధించేవారు కాదని ఆయనకు సన్నిహితంగా వ్యవహరించేవారు చెప్తున్నారు. హిందుత్వ అతివాద భావజాలం గల ఆర్‌ఎస్‌ఎస్‌సై మొదటిసారిగా నిషేధం విధించిన హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన భారత దేశంలో 540 సంస్థానాలను విలీనం చేయడానికి ఎంతైతే కటువుగా వ్యవహరించాడో ఆర్‌ఎస్‌ఎస్ మత రాజకీయాలపైనా అంతే కటువుగా ఉన్నారు. సాంస్కృతిక సేవ కార్యక్రమాలకే పరిమితమవుతామని, తమ నియామవళిని సవరించుకుంటామని ఆర్‌ఎస్‌ఎస్ కళ్లభేరానికి వస్తే తప్ప నిషేధం ఎత్తివేయలని ధృడచిత్తుడు సర్దార్ పటేల్. నూటికి నూరుపాళ్లు నిఖార్సయిన లౌకికవాది అయిన సర్దార్ వల్లభాయ్‌పటేల్‌కు హిందుత్వ రంగు అంటగట్టి ఆయన్ను ఇప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని ఆరోపిస్తూ తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ దారుణమైన ఎత్తుగడ వేసింది. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో మతం ప్రాతిపదికగా హిందూ, ముస్లింలను నిట్టనిలువునా చీల్చాలని తద్వారా దశాబ్దం క్రితం ఎన్‌డీఏకు దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విలూరుతోంది. హిందుత్వ అతివాదిగా ముద్రపడిన మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారానే ప్రజల్లో ఉండే సున్నితమైన భావోద్వేగాల్ని రగల్చాలని బీజేపీ కుయుక్తి పన్నింది. భారత్, పాకిస్తాన్ విభజనను పటేల్ కాదు మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. మత ప్రాతిపదికన దేశ విభజన మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. అదే జరిగితే పాకిస్తాన్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా భారత్‌లో అల్పసంఖ్యాకులుగా ఉన్న ముస్లింలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి ముస్లిం లీగ్, జిన్నా ఆగ్రహానికి గురయ్యాడు అబుల్‌కలాం ఆజాద్. మోడీ కనుక పటేల్‌ను కాకుండా అబుల్‌కలాంను పొగిడి ఉంటే కనీస లౌకికవాదిని భుజానికెత్తుకున్న వాడయ్యే వాడు. అలా కాకుండా పటేల్‌ను హిందుత్వ వాదిగా చూపి జాతి మధ్య చిచ్చుపెట్టజూస్తే అది మొదటికే మోసం తేవొచ్చు. మోడీ, బీజేపీ చేస్తున్న విష ప్రయత్నాలు జాతి విచ్ఛిన్నానికి కారణమవచ్చు. ఇప్పుడు భారత జాతి అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.