సచిన్ రెండో ఇన్నింగ్స్ రాజకీయాలేనా?!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్. ఈ పేరు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేనిది. అంతర్జాతీయ క్రికెట్ ఆడేది 12 దేశాలే అయిన క్రికెట్‌లోకి అడుగుపెట్టాలని తహతహలాడుతున్న మరో 180కి పైగా దేశాల్లో ఆయనకు ఎందరో అభిమానులున్నారు. అసలు క్రికెట్ ఆడని దేశాల్లోనూ సచిన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ అంటేనే సచిన్ టెండుల్కర్ అనే స్థాయిలో తనదైన ముద్రవేసుకున్నాడు లిటిల్ మాస్టర్. క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా దానికి గ్లామర్ సొబగులు అద్దింది మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)నే. సంప్రదాయ టెస్ట్ మ్యాచ్‌లైనా, ఒకే రోజు ఫలితం తేలే వన్డే మ్యాచ్‌లైనా సచిన్ టెండుల్కర్ ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టకమానదు. ఒక్క సచిన్ వికెట్ తీసుకోగలిగితే మ్యాచ్ గెలిచేయగలం అని వివిధ సందర్భాల్లో ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు చెప్పారు. సచిన్ వికెట్ తీసుకోవడమంటే బౌలర్‌కూ ఎంతో గౌరవం. నేను సచిన్‌ను ఔట్ చేశాను అని అతడు గర్వంతో చెప్పుకోగలడు. ఒక సామాన్యుడు క్రికెట్ బ్యాట్‌తో దేవుడిగా ఎదగడం వెనుక కఠోర శ్రమ, ఎన్నో త్యాగాలు, మరెంతో ఓర్పు, నేర్పు, నమ్ముకున్న వృత్తిపట్ల అంకితభావం ఇలా మరెన్నో… సచిన్ టెండుల్కర్ వన్డేల్లో ఓపెనర్‌గా, టెస్టుల్లో మిడిల్డార్ బ్యాట్స్‌మన్‌గా తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. బుడిబుడి అడుగుల పసిప్రాయంలోనే క్రికెట్ బ్యాట్ పట్టుకున్న సచిన్ టెండుల్కర్ ఆ తర్వాత కూడా బ్యాట్‌తోనే సహవాసం చేశాడు. తోటివాళ్లంతా చదువు బిజీలో పడినా తాను మాత్రం బ్యాట్‌ను విడిచిపెట్టలేదు. శరదాశ్రమ్ స్కూల్ తరఫున సహచరుడు వినోద్‌కాంబ్లీతో కలిసి ప్రపంచ రికార్డు స్కోరు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 1973 ఏప్రిల్ 24న రమేశ్ టెండుల్కర్, రజిని దంపతులకు జన్మించిన టెండుల్కర్ 11 ఏళ్ల వయసులో కోచ్ రమాకాంత్ అచేక్రర్ వద్ద శిక్షణ కోసం చేరాడు. 16 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ రోజు నుంచి క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికే శనివారం వరకు ఆయన భారత క్రికెట్‌కు తురుపుముక్కలా ఉన్నాడు. భారత్ సాధించిన అనేక చిరస్మరణీయమైన విజయాల్లో ఆయన కీలక భూమిక పోషించాడు. తనదైన బ్యాటింగ్ నైపుణ్యంతో భారీ స్కోర్లను తనముందు తలవంచేలా చేశాడు. ఎంతటి భీకర బౌలరైనా సచిన్‌కు పరుగులు సమర్పించుకోవాల్సిందే. ఆయన ఫ్రంట్‌పుట్‌లోకి వచ్చి సిక్సర్ కొడుతున్నట్లు తన కలలోకి వస్తున్నాడని దిగ్గజ ఆఫ్‌స్పిన్నర్ షేన్‌వార్న్ పేర్కొన్నాడు. తాను భారత్‌లో దేవుడ్ని చూశానని, అతడు టెస్టుల్లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మ్యాథ్యు హెడెన్ అన్నారు. అలాగే ఎందరో విఖ్యాత క్రికెటర్లు సచిన్‌తో కలిసి తాము ఆడటం తమకే గర్వకారణమని పేర్కొన్నారు. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన శరీరం నిలువెల్లా గాయాలమయమైంది. టెన్నిస్ ఎల్బో అనే కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే సచిన్. అదేదో క్రికెట్‌లో ఉపయోగించే పదం కాదు. సచిన్ చేతికి అయిన గాయం. టెన్నిస్ ఎల్బో గాయానికి ఆయనకు పలుమార్లు శ్రస్తచికిత్స నిర్వహించారు డాక్టర్లు. అయినా పరుగుల యంత్రం విశ్రాంతిని కోరుకోలేదు. 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సచిన్ 34,357 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇంకెవరికీ సాధ్యం కాని వంద సెంచరీలు ఆయన ఖాతాలో జమయ్యాయి. 164 అర్ధసెంచరీలు సాధించాడు. 90 పరుగుల తర్వాత సెంచరీకి చేరువయ్యాక ఆయన అనేక పర్యాయాలు ఔటయ్యాడు. వన్డేల్లో మొట్టమొదటి సారిగా డబుల్ సెంచరీ సాధించి తనకేదైనా సాధ్యమే అని నిరూపించాడు. 129 సార్లు ఇండియా తరఫున అత్యధిక స్కోర్ సాధించిన బ్యాట్స్‌మన్ సచిన్. క్రికెట్‌కు తానే పరిభాషగా మారిన సచిన్‌ను అన్నో అవార్డులు వరించాయి. ఆయన క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజే భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా సచిన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 40 ఏళ్ల వయసులోనే సచిన్ భారతరత్న సొంతం చేసుకున్నాడు. భారత జాతీయ క్రీడ హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు మొదట భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉన్నా సచిన్‌నే ముందుగా అదృష్టం వరించింది. సచిన్‌కు ఈ అవార్డు ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న నిబంధనలను మార్చేసింది. నిబంధనలు మార్చిన కేంద్రం మొదటగా ధ్యాన్‌చంద్‌కే అవార్డు ఇస్తే జాతీయ క్రీడకు గౌరవం ఇచ్చినట్లయ్యేది. ఈ విషయాన్ని పక్కన బెడితే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఏం చేస్తాడనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. తన సీనియర్లకు మాదిరిగా సచిన్ కామెంట్రేటర్‌గా మారుతాడా? లేక రాజకీయాల్లోకి వస్తాడా అనే చర్చ సాగుతోంది. సచిన్‌ను ఇప్పటికే రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశాడు. 2012లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. క్రికెట్ టూర్లలో బిజీగా ఉండటంతో రెండు, మూడు పర్యాయాలు తప్ప పార్లమెంట్‌కు హాజరుకాలేదు. ఇప్పుడు క్రికెట్‌ను వీడటంతో ఆయన పూర్తిస్థాయి రాజకీయ వేత్తగా మారుతారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. సచిన్ క్రీడల మంత్రిగా బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉంది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రయత్నాలు ఫలవంతమవుతాయా? సచిన్ క్రికెట్‌ను పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి వస్తారా? సిద్దూ, అజారుద్దీన్ మాదిరిగా పార్లమెంట్‌లో గళమెత్తుతారా? అనే ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. వాటికి సమాధానం చెప్పే వ్యక్తి సచిన్ మాత్రమే. రెండున్నర దశాబ్దాల భారత క్రికెట్‌కు సేవలందించిన సచిన్ తన రెండో ఇన్నింగ్స్‌నూ విజయవంతంగా ప్రారంభిస్తాడని ఆశిద్దాం.