శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

371(డి)కి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు
హైదరాబాద్‌పై పాక్షిక ఆంక్షలు ఉండొచ్చు
సోనియాతో భేటీ అనంతరం జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) :
శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేని బిల్లు వస్తుందని అన్నారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై చర్చించనట్లు సమాచారం. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోగా విభజన పక్రియ పూర్తయ్యేలా చూడాలని జైపాల్‌రెడ్డి సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయరాదని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఆయన అధినేత్రిని కోరినట్లు సమాచారం. అలాగే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే ప్రతిపాదనతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహార శైలి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాగా జీవోఎం సిఫార్సులు ఖరారు అవుతున్న నేపథ్యంలో జైపాల్‌రెడ్డి సోనియాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అంశానికి సంబంధించి బిల్లు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే సోనియాతో చర్చించిన అంశాలను తాను వెల్లడించలేనని జైపాల్‌ అన్నారు. అయితే రాయల తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సోనియా గాంధీకి సృష్టం చేసినట్లు సమాచారం. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. 10 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఆయన రాయల తెలంగాణ ఒప్పుకునేది లేదని సోనియాకు సృష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని, ఆర్టికల్‌ 371(డి)ని కొనసాగించాలని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే ఇది అడ్డంకి కూడా కాదన్నారు.