ఈ సమావేశాల్లోనే టీ బిల్లు
కాకుంటే ప్రత్యేక సమావేశం : కమల్‌నాథ్
మహిళా రిజర్వేషన్, లోక్‌పాల్ బిల్లుపై అఖిలపక్షం
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టండి : సుష్మ
యథాతథంగా మహిళా బిల్లు ఆమోదించం : ఎస్పీ
హైదరాబాద్, డిసెంబర్ 2 (జనంసాక్షి) :
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. లేనిపక్షంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు రావాలని కోరుకుంటున్నాయని చెప్పారు. ఈనెల ఐదున పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో మహిళా రిజర్వేషన్, లోక్‌పాల్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు మొదట కేబినెట్ ఆమోదం పొందాలని, ఆ తర్వాత రాష్ట్రపతికి, ఆ తర్వాత న్యాయశాఖకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం కోసం వెళ్లాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని అన్నారు. బిల్లును ఆమోదించడం లేదా వ్యతిరేకించడం ఆయా రాజకీయ పార్టీల ఇష్టమని, తెలంగాణ బిల్లు మాత్రం పార్లమెంట్ ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు పెట్టాలని తాము కోరామని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. ఈమేరకు అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిని కోరామని ఆమె వెల్లడించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం సాధ్యం కాదని కేంద్ర హోమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారని ఆమె అన్నారు. కాగా ఇప్పుడున్నట్టుగానే మహిళా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం తెలపబోమని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఎస్సీ, ఎస్టీ కోటా ప్రమోషన్లకు సంబంధించిన బిల్లును తాము అంగీకరించమని ఆ పార్టీ పేర్కొంది.
అయితే తెలంగాణ బిల్లు ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ రాష్ట్రంలో సర్వత్రా నెలకొంది. రాయల తెలంగాణా? లేకా హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణా? అనే సంశయం అందరిలో నెలకొంది. ఇంతకీ ‘టీ’ బిల్లు ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు వస్తుందా? రాదా? అనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగే కేంద్ర కేబినెట్ కీలక సమావేశంలో తెలంగాణ అంశంపై తేలిపోనుందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెబుతున్నారు. రాయల తెలంగాణకు సంబంధించి ఎటువంటి అంశాలను తాను ఖండించలేనని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కేంద్ర హోంమంత్రి షిండే మాటలను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్ర బిల్లు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వచ్చేది రానిది కచ్చితంగా చెప్పడంలేదు. కాని అతి త్వరలో అని మాత్రమే చెబుతున్నారు. జీఓఎం సమావేశాలు ముగిశాయని చెబుతూనే మంగళవారం కూడా జీఓఎం సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పడం గమనర్హాం. టీ బిల్లుపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో అటు తెలంగాణ ప్రజల్లో ఇటు సీమాంధ్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు ఏరూపంలో వస్తుందనే ఆందోళన, ఉత్కంఠ రాష్ట్ర నేతల్లో, తెలంగాణ ప్రజల్లో కనిపిస్తున్నది. రాయల తెలంగాణపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరి నేతల్లో అనుకూలత కనిపిస్తున్నది. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రఘువీరారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ వంటి నేతలు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతుండటమే కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రాయల తెలంగాణ కోసం కొందరు నేతలు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సుమారు 1700 గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయించినట్టు సమాచారం. తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్, ఉద్యోగ సంఘాలు, టీవాదులు రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడు రోజులుగా హస్తినలో మకాం వేసి కాంగ్రెస్ పెద్దలను కలిసి రాయలకు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ నెల 8న రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసినట్టు హస్తిన వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తూనే ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టే విధంగా వ్యూహాలు పన్నుతున్నట్టు భొగట్టా. ఈ పార్టీలను ఏకకాలంతో దెబ్బతీయాలంటే రాయల తెలంగాణ ఒక్కటే శరణ్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న రాయలసీమను విడగొట్టి తెలంగాణలో కలపడం వల్ల ఇటు కేసీఆర్‌ను, అటు జగన్‌ను బలహీనపరచవచ్చని కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.