రాయల తెలంగాణ అంటే సీమ, తెలంగాణ ప్రజలను హింసించడమే

సీడబ్ల్యూసీ, యూపీఏ, కేబినెట్‌ నిర్ణయాల్లో రాయల్‌ లేదు : జైపాల్‌రెడ్డి
పది జిల్లాల తెలంగాణే.. కాదంటే మహా ఉద్యమం : కోదండరామ్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :
రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమంటే సీమ, తెలంగాణ ప్రాంత ప్రజలను హింసించడమేనని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జైపాల్‌రెడ్డి నివాసంలో రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేంద్రం చర్యలను తెలుసుకునేందుకు టీజేసీ నేతలు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కేబినెట్‌ నిర్ణయాల్లో రాయల తెలంగాణ లేదని తెలిపారు. తెలంగాణను డిస్ట్రబ్‌ చేయడం తగదని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయమే కొలబద్ద కావాలని, లేకుంటే చిక్కులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. రాయల తెలంగాణకు ఎవరూ అనుకూలంగా లేరని, ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవద్దని హితవు పలికారు. ఈ భేటీకి ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్య తదితరులు హాజరయ్యారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణే తమకు అంగీకారమని తెలంగాణ ఐకాస నేతలు పేర్కొన్నారు. భేటీ అనంతరం వారు మాట్లాడుతూ రాయల తెలంగాణ అనేది కుట్రపూరిత ప్రతిపాదన అన్నారు. అది రెండు ప్రాంతాలకూ అంగీకారం కాదన్నారు. తెలంగాణ అనేది కేవలం భౌగోళిక అంశం కాదని పేర్కొన్నారు. రేపు శరద్‌యాదవ్‌, సురవరంలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరతామని కోదండరాం తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ నేతలదేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానానికి భిన్నంగా ఇప్పుడు కొత్త ప్రతిపాదనను అంగీకరించబోమన్నారు. తామకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరొకటి అంగీకారం కాదన్నారు. కేంద్రం మొండిగా రాయల తెలంగాణపై ముందుకు వెళ్తే మహోద్యమాన్ని నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే కేంద్రం నడుచుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. వీరు కూడా తాజా పరిణామాలపై చర్చించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.