ఏ క్షణాన్నైనా యుద్ధం

పాక్‌ ప్రధాని నవాజ్‌
మీకంత సీన్‌ లేదు
చావు దెబ్బ తింటారు : మన్మోహన్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4, (జనంసాక్షి) :
కాశ్మీర్‌ అంశంలో భారత్‌తో ఏ క్షణంలోనైనా యుద్ధం రావొచ్చని పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కవ్వింపులకు తెరతీశారు. నవాజ్‌ వ్యాఖ్యలపై ప్రధాని మన్మోహన్‌ ఘాటుగా స్పందించారు. మీకంత సీన్‌ లేదని, యుద్ధమే వస్తే చావు దెబ్బతింటారని హెచ్చరించారు. ఏ తరహా యుద్ధంలోనైనా పాకిస్తాన్‌ను ఓడించగలమని మన్మోహన్‌ హెచ్చరించారు. కాశ్మీర్‌ వివాదంపై ఏ క్షణంలోనైనా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరో సారి యుద్ధం జరుగవచ్చని డాన్‌ పత్రిక తన బుధవారం సంచికలో ప్రచురించింది. ఆజాద్‌ జమ్ము కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. అంతర్జాతీయ సంస్థలతోనే కాశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని షరీఫ్‌ పేర్కొన్నట్లు రాసింది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విరుచుకుపడ్డారు. తన జీవిత కాలంలో పాకిస్తాన్‌ యుద్ధంలో గెలిచిన దాఖలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి యుద్ధం వచ్చినా పాక్‌ గెలుస్తుందన్న నమ్మకం లేదని ఆయన వివరించారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ప్రధాని నవాజ్‌ షరిఫ్‌ చేయలేదని ఆయన కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇది ఉద్దేశ పూర్వకంగా ప్రచురించిన వార్త అని పేర్కొంది. షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, అసత్యాలు అని వివరణ ఇచ్చింది. కాశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొంది. కాశ్మీర్‌ వివాదం భారత్‌-పాకిస్తాన్‌ మధ్య నాలుగో సారి యుద్ధానికి దారితీయవచ్చని నవాజ్‌ పేర్కొన్నారు. ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ వేదికలపై ఈ వివాదాన్ని లేవనెత్తుతున్నామని, ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ వేదికలపై ఈ సమస్య పరిష్కారమవుతుందని తాము నమ్ముతున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో జరిగిన భేటీలోనూ ఆ అంశాన్ని ప్రస్తావించినట్లు నవాజ్‌ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) వద్ద కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని, ఆయుధాల ప్రదర్శనను కోరుకోవడం లేదని చెప్పారు. భారత్‌ కూడా సమస్య సానుకూల వాతావరణంలోనే పరిష్కారం కావాలని కోరుతోందని, పాకిస్తానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మన్మోహన్‌ పేర్కొన్నారు. పాక్‌ యుద్ధాన్నే కోరుకుంటే దానికి తగిన రీతిలో బదులిస్తామని చెప్పారు.