తెలంగాణకు కేంద్రం జై
పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
సీడబ్ల్యుసీ తీర్మానం, కేబినెట్ నిర్ణయాల మేరకే ప్రత్యేక రాష్ట్రం
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజల రక్షణపై గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు
రెండు రాష్ట్రాల్లో ఆర్టికల్ 371(డి) కొనసాగింపు
పోలవరానికి జాతీయ హోదా
రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సాయం
న్యూఢిల్లీ, డిసెంబరు 5 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం జైకొట్టింది. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష, నాలుగు దశాబ్దాల పోరాటాన్ని గౌరవించింది. హైదరాబాద్, పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌పై కొద్దిపాటి కొర్రీలు పెట్టినా సీమాంధ్రుల బెదిరింపులను గొంతెమ్మ కోర్కెలను మాత్రం పట్టించుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఇక్కడి ప్రజల రక్షణపై తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఉంటాయని కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజనపై చర్చించేందుకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మూడు గంటలకు పైగా చర్చించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2013కు కేంద్రం మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపిస్తామని అన్నారు. ఆయన దానిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతారని, నిర్ణీత వ్యవధిలోగా అసెంబ్లీ అభిప్రాయం చెప్పగానే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువస్తామని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టికల్ 371(డి) కొనసాగిస్తామని, దీనిద్వారా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థానికత వర్తిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ అంశంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి నివేదిక సమర్పించిందని అన్నారు. 18 వేల ఈమెయిల్స్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలతో 11 అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు జరిపి ముసాయిదా రూపొందించిందని చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సాయమందిస్తుందని, సీమాంధ్ర భూభాగం 13 జిల్లాలతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ప్యాకేజీతో పాటు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు.