తరుణ్ తేజ్‌పాల్ పోలీసు కస్టడీ పొడిగింపు
పనాజీ, డిసెంబర్ 7 (జనంసాక్షి) :
మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు పనాజీ జిల్లా సెషన్స్‌కోర్టు పేర్కొంది. తెహెల్కాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై తేజ్‌పాల్‌ను గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తేజ్‌పాల్‌కు మొదట ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన జిల్లా సెషన్స్ న్యాయస్థానం తాజాగా ఈ నెల 10 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేజ్‌పాల్‌ను శనివారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు ఆయనకు ఇటీవల లైంగిక పటుత్వ పరిక్షలు నిర్వహించారు. పలువురు సాక్షులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. తేజ్‌పాల్ తమ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని, ఆయన నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉంది కాబట్టి కస్టడీ పొడిగించాలని పోలీసులు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించనగా న్యాయమూర్తి మరో నాలుగు రోజుల పాటు ఆయన కస్టడీ పొడిగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.