నాలుగు రాష్ట్రాల్లో కమల వికాసం
ఢిల్లీలో హంగ్
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో హ్యాట్రిక్
హస్తినలో ఆమ్ ఆద్మీ పార్టీ హవా
షీలా దీక్షిత్ ఓటమి
న్యూఢిల్లీ, డిసెంబర్ 8 (జనంసాక్షి) :
నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. ఢిల్లీ, రాజస్థాన్‌లలో అధికార కాంగ్రెస్‌ను ఓటర్లు చావుదెబ్బకొట్టారు. ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఇంటి దారిపట్టించారు. ఢిల్లీలో మూడోస్థానానికి కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. రాజస్థాన్‌లో అయితే 20 పైచిలుకు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సర్వేలు, ఓపీనియన్ పోల్స్ సర్వేలు సైతం నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అధికార స్థానాల్లో బిజెపి పాగా వేసింది. అశోక్‌గెహ్లాట్‌ను, ఆయన ప్రభుత్వాన్ని రాజస్థాన్ ప్రజలు ఓడించారు. ఢిల్లీలోని షీలాదీక్షిత్‌ను, ఆమె ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిపించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తన హవాను కొనసాగించింది. ఇదిలా ఉండగా అవినీతి, కుంభకోణాలు, మహిళలపై అరాచకాలు ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషించాయి. ఆయా అంశాల్లో ప్రమేయమున్న పార్టీలను, ప్రభుత్వాలను ప్రజలు కూలదోశారు. దేశరాజధాని ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలుండగా బిజెపి 31 స్థానాలు సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లోను, కాంగ్రెస్ 8 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లోను గెలుపొందారు. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ సీట్లకు గాను బిజెపి 49, కాంగ్రెస్ 39, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో 230 ఎమ్మెల్యే సీట్లకు గాను బిజెపి 165, కాంగ్రెస్ 58, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. రాజస్థాన్‌లో 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బిజెపి 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాల్లో విజయం సాధించారు. రాజస్థాన్‌లో ఎన్నికల షెడ్యూలు విడుదల రోజు నుంచి పోలింగ్ జరిగేంతవరకు వసుంధరరాజె సింధియా విలక్షణంగా వ్యవహరించారు. తనకున్న రాజకీయ అనుభవంతోను, పార్టీకి విజయం చేకూర్చాలన్న లక్ష్యంతో ఆమె అవిశ్రాంతంగా శ్రమించారు. 60 సంవత్సరాల వసుంధరరాజె సింధియా ఒంటిచేత్తో పార్టీని విజయతీరాల వైపు నడిపించారు. లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాజస్థాన్‌లో బిజెపి తన హవాను ఆద్యంతం కొనసాగించింది. రాష్ట్ర అసెంబ్లీలో 200నియోజకవర్గాలు కాగా.. ఒక నియోజకవర్గంలో ఎన్నిక రద్దయిన విషయం తెలిసిందే. 199నియోజకవర్గాల్లో లెక్కింపు కొనసాగింది. 162స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 16 స్థానాల్లో గెలుపొందారు. అశోక్ గెహ్లాట్ వ్యూహాలను వసుంధరరాజె తొలి నుండి తిప్పికొట్టారు. ప్రభుత్వ అవినీతి చిట్టాపై పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేసి మరీ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆమె తన జీవితంలో రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. మోడీ ప్రచార ప్రభావం కూడా ఓటర్లపై ఎంతో చూపింది. రాజస్థాన్ రాజకీయ పటంలో ఉన్న ఒక సెంటిమెంట్ తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి నిజమైంది. 1990నుంచి రాజస్థాన్‌లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు అన్నది రుజువైంది. ఇదిలా ఉండగా సొంతపార్టీలోని అసమ్మతే అశోక్‌గెహ్లాట్ ప్రభుత్వ ఓటమికి కారణమై ఉంటుందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు.కుంభకోణాలు, అవినీతి, హత్య, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు తిరిగి టిక్కెట్లు ఇవ్వడం.. తదితర కారణాలు పార్టీ ఓటమి పాలయ్యేందుకు మరో కారణమని వారు అంటున్నారు. ఢిల్లీకి నాలుగోసారి సీఎంగా వద్దంటూ షీలాదీక్షిత్ ప్రభుత్వాన్ని ఓటర్లు ఇంటికి సాగనంపారు. కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టారు. కొత్తగా పుట్టుకొచ్చిన అమ్‌అద్మీ పార్టీ ప్రధాన పార్టీలకు చుక్కలను చూపింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మాజిక్ ఫిగర్‌కు ఐదు సీట్ల దూరంలో బిజెపి ఆగిపోగా ఆమ్‌అద్మీ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోనుంది. షీలాదీక్షిత్‌పై 22 వేల మెజారిటీతో అమ్‌అద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గెలుపొందారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయభేరి మోగించారు. బుధ్నిలో 60వేల పైచిలుకు ఓట్లతోను, విదిశలో 17వేల ఓట్ల తోను గెలుపొందారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హ్యాట్రిక్ నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లో తిరుగులేని విజయం సాధించగా, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటినిచ్చినా పది స్థానాలు వెనుకబడింది. మూడోసారి అధికారమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మీడియాతో అన్నారు. ఇది ప్రజా విజయం. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా అన్నారు. ఓటమిని ఊహించలేదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. పార్టీని విజయం దిశగా నడపడంలో నేతలు విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు తమను నిరాశకు గురి చేశాయని వాపోయారు. ఢిల్లీ రాష్ట్ర బిజెపి సీఎం అభ్యర్ధి హర్షవర్ధన్ కృష్ణానగర్ నుంచి 43 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఛత్తీస్‌గఢ్‌్ సీఎం రమణసింగ్ రాజనందగావ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.