నాడు తీర్మానం పెట్టమని.. ఉమ్మడి రాజధాని ఎలా చేస్తారు

తెలంగాణ బిల్లుకు మద్దతివ్వం : బాబు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :
నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు మళ్లీ అడ్డం తిరిగాడు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాము తెలంగాణ బిల్లుకు మద్దతివ్వబోమని సమైక్య బాబు స్పష్టం చేశాడు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీతరహాలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీని ఊడ్చిపారేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దొంగలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేందుకు యూపీఏకు అర్హత లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ సభ్యులంతా కలసి అవిశ్వాస తీర్మానం ద్వారా యూపీఏను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఓ సాధారణ వ్యక్తి అవినీతిపై పోరాడి.. ఢిల్లీ సీఎంపై ఘన విజయం సాధించాడని.. ఆప్‌ కన్వీనర్‌ కేజీవ్రాల్‌ను అభినందించారు. 2009 నుంచి తాము జగన్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. తాను సూచించిన అర్థక్రాంతి కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకునుంటే ప్రస్తుత ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. అవినీతి కనుమరుగు కావలన్నా, పారదర్శక పాలన రావాలన్నా.. కాంగ్రెస్‌ను ఇంటికి పంపాల్సిందేని పునరుద్ఘాడుతూ చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందని, అవినీతి రహిత భారతదేశం రావాలంటే కాంగ్రెస్‌ ఇంటికి వెళ్లాలన్నారు. ప్రజావిశ్వాసాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిందని, సోనియా అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. యూపీఏకు ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని, ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందన్నారు. ఘనవిజయం సాధించిన కేజీవ్రాల్‌ను అభినందిస్తున్నానని అన్నారు. ఉమ్మడి రాజధాని అన్నది ఇప్పటి వరకు ఎక్కడా లేదు. సీమాంధ్రలో అద్భుతమైన రాజధాని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎక్కడ, ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నా. ప్రతిరోజు గందరగోళం సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. విద్యా పరంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయని, అన్ని విధాలుగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో 55 సెజ్‌లు ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా విభజన ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు అధిక మొత్తంలో హైదరాబాద్‌ నుంచే ఆదాయం వస్తుంది. హైదరాబాద్‌ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాను అని తెలిపారు. ఇదిలావుంటే అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రభుత్వాలను కూలిస్తే విబన ఆగుతుందని బాబు భావిస్తున్నారు. తెలంగాణ బిల్లును ఓడించేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేందుకు బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది రాష్ట్ర నేతలతో రహస్య మంతనాలు జరుపుతోందని సమాచారం. ఈ నెల 12 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణను ఆపేందుకు ఇప్పటికే పయ్యావుల కేశవ్‌తో మంత్రి శైలజానాథ్‌ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పడిపోయినా తెలంగాణ బిల్లు ఆగదని తెలిసి కూడా ప్రజలను మభ్య పెట్టేందుకే టీడీపీ డ్రామాలు ఆడుతోందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందన్నది చూడాలి.