అవిశ్వాసానికి భాజపా మద్దతివ్వదు:కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: అవిశ్వాసానికి భాజపా మద్దతు ఇస్తుందని కొన్ని రాజకీయ పార్టీలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెట్టే ఏ అవిశ్వాసానికైనా బీజేపీ మద్దతివ్వదన్నారు. కేవలం రోజులు లెక్కపెట్టే ప్రభుత్వంగా యూపీఏ మారిందన్నారు.రాష్ట్రంలో ఆధిపత్యం కోసమే జరుగుతున్న ఆరాటమే తప్ప ఇది సమైక్య ఉద్యమం కాదన్నారు. జగన్‌, చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే చర్చలో కచ్చితంగా పాల్గొంటామని యూపీఏ విధానాలను ఎండగడతామని కిషన్‌ రెడ్డి తెలిపారు.