పార్లమెంట్‌పై దాడి మృతులకు ప్రముఖుల శ్రద్ధాంజలి

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) :
పార్లమెంటుపై పన్నెండేళ్ల క్రితం జరిగిన దాడిలో మృతిచెందిన వారికి పార్లమెంట్‌ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు శకద్ధాంజలి ఘటించారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉభయ సభల్లో విపక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, పలు ఇతర పార్టీల నాయకులు ఆనాటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. అమరస్తూపం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. వారి త్యాగం నిరుపమానమని ప్రధాని మన్మోహన్‌ కొనియాడారు. 2001 డిసెంబర్‌ 13వ తేదీన భారీగా ఆయుధాలతో విరుచుకుపడిన ఉగ్రవాదులు పార్లమెంటును చుట్టుముట్టారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఐదుగురు పోలీసులు సహా మొత్తం 11 మంది మరణించారు. కాగా, శుక్రవారం నాడు పలువురు నాయకులు పన్నెండేళ్ల నాటి పార్లమెంటు దాడి సంఘటనపై స్పందించారు. పేలుళ్ల సూత్రధారిని అరెస్టు చేయాల్సిందేనని లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. కనీసం ఇన్నాళ్లకైనా ఒక ఉగ్రవాదిని పట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. దాడిలో మరణించినవారికి బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా నివాళులు అర్పించారు. దోషులను పట్టి ఇవ్వడంలో పాక్‌ చేస్తున్న తాత్సారంపై నేతలు మండిపడ్డారు.