తెలంగాణను సీఎం అడ్డుకుంటున్నడు


రాజ్యాంగం చదువుకో
కిరణ్‌కు కోదండరామ్‌ హితవు
మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్‌ అడ్డుకుంటున్నాడని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారులతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో పీడీఎస్‌యూ సభలో పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవివేకంతో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆర్టికల్‌ 371డీ విభజనకు అడ్డు కాదని, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని చదువుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు 371 డి ఆర్టికల్‌ అడ్డుకాబోదని కోదండరామ్‌ అన్నారు. అనుమానాలుంటే రాజ్యాంగం చదువుకోవాలని హితవు పలికారు. విభజన పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అవివేకంగా వ్యవహరిస్తున్నాని ఆరోపించారు. ఆంక్షల ద్వారా తెలంగాణను ఇవ్వడాన్ని ఒప్పుకోమని అన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. అదేవిధంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఉమ్మడి హైకోర్టు కూడా ఒప్పుకోం అని పేర్కొన్నారు. ఇవేవీ కూడా తమకు సమ్మతం కావన్నారు. ఇక్కడి హక్కులను కాలరాసే ఇలాంటి ఒప్పందాల కారణంగా ఇక్కడి విద్యార్థులకు, ప్రజలకు తీరని నష్టం జరగగలదన్నారు. ఆంక్షలను తొలగించాలన్న డిమాండ్‌తో త్వరలో మరోమారు ఢిల్లీ వెళతామని అన్నారు. ఆంక్షలు ఎత్తి వేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు.ఇందుకోసం అవసరమైతే అందరిని కలసి చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.