ఎవర్నడిగి జలయజ్ఞం నిధులు కేటాయించావ్
సీఎం ఒంటెత్తు పోకడలపై డెప్యూటీ సీఎం ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 19 (జనంసాక్షి) :
ఎవర్నడిగి జలయజ్ఞానికి నిధులు కేటాయించావని డెప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఫైరయ్యారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ. 20 వేల కోట్లు అదనపు నిధులు ఏకపక్షంగా కేటాయించారని డెప్యూటీ సీఎం మండిపడ్డారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేయడం సరికాదని, ఈ విషయంపై సీఎస్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. సీఎస్ స్పందించకుంటే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు దామోదరం రాజనర్సింహ వివరించారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ వల్ల ఖమ్మం జిల్లాలో గ్రామాలు మునుగుతున్నాయని, వారికి న్యాయం చేయకుండా దుమ్ముగూడెం కాంట్రక్టర్లకు నిధులు ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం కంట్రాక్టర్లకు లాభం చేసకూర్చేందుకు మాత్రమే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జలయజ్ఞం ప్రాజెక్టుల అంచనాల పెంపును అంగీకరించేది లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రాజెక్టుల అంచనాల పెంపు ఎవరి ప్రయోజనాల కోసమంటూ ఆయన ప్రశ్నించారు. అంచనాల పెంపు వల్ల తెలంగాణ ప్రజలపై పరోక్ష భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేబినెట్‌లో చర్చించకుండా పెంపుపై నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని, మళ్లీ రాస్తానని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇదే విషయంపై త్వరలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కూడా కలుస్తానని చెప్పారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన పూర్తవుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదంటున్నారు. ఎంత ఆలస్యం చేసినా ఫిబ్రవరి 15 నాటికి తెలంగాణ ఖాయమని, ఆ తర్వాత రెండు రాష్టాల్లోన్రూ రాష్ట్రపతి పాలన ఉంటుందని దామోదర వివరించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గాల రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, అందుకు ఎన్నికల సంఘానికి తగిన సమయం అవసరమవుతుందని తెలిపారు. రెండు ప్రాంతాల్లో శ్రేణులను సాధారణ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోందని, వారం పదిరోజుల్లో రెండు ప్రాంతాల్లో పీసీసీ నేతృత్వంలో రెండు తాత్కాలిక ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తారని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.