టీడీపీ ఖేల్ ఖతం
తెలంగాణ ఖాయం : కేసీఆర్‌దివారం తెలంగాణ భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యే హన్మంతషిండే కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఇక తెలుగుదేశం పార్టీ భూస్థాపితమేనని అన్నారు. తెలంగాణను ఎవ్వరూ ఇక ఆపలేరని, విభజన ఖాయమని అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, అప్పటి హామీలను ప్రభుత్వాలు పాటించకపోవడంవల్లనే ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని అన్నారు. ఓయూ విద్యార్థులను తాలబన్లతో పోల్చిన సీమాంధ్రులు ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడమే తప్పించి, సీమాంధ్రులకు కావలసిన సమస్యలను వివరించలేకపోతున్నారని అన్నారు. మాది మాకు కావాలని తెలంగాణ ప్రజలు కోరుతుంటే, మీది, మాది రెండూ కావాలంటూ ఆంధ్ర నేతలు కోరుకోవడం అసంబద్ధమని, అన్యాయమని అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాలూప్రసాద్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని, అలాగే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రుల వలస పాలనలో నిజామాబాద్ జిల్లా పూర్తిగా నాశనమైందని, నిజాం షుగర్ కంపెనీ, నిజాంసాగర్ నీళ్లు కనిపించకుండా పోయాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. సరైన సమయంలో హన్మంత్‌షిండే తీసుకున్న నిర్ణయం తమకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండేలా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు వద్దని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఈ దశలోనూ సీమాంధ్ర నేతలు కోరడం వారి అవివేకానికి నిదర్శనమని కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఆ డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇంకా తెలంగాణను అడ్డుకోజూస్తే దానికి తగిన ప్రతిఫలం కూడా అనుభవించి తీరుతారని, తమ ఇక్కట్లను పట్టించుకోని నేతలకు సీమాంధ్ర ప్రజలు బుద్ధిచెప్పి తీరుతారని హెచ్చరించారు.