ఆస్తులు కాపాడుకునేందుకే

సీమాంధ్రుల డ్రామా
– డెప్యూటీ సీఎం దామోదర
సంగారెడ్డి, డిసెంబర్‌ 22 (జనంసాక్షి) :
ఆస్తులు కాపాడుకునేందుకే సీమాంధ్రులు సమైక్య రాష్ట్రం పేరుతో డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ నేతల ఆస్తులను రక్షించుకునేందుకే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తెచ్చారని దామోదర్‌ ధ్వజమెత్తారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ చేర్చిన విషయం సీమాంధ్ర నేతలు ఎందుకు చెప్పడం లేదో తనకు అర్ధం కావడం లేదని రాజనర్సింహా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మునిపల్లి మండల కేంద్రంలో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, రూ. కోటి వ్యయంతో బుదేరాలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో దామోదర మాట్లాడారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసిందని ఇక్కడి ప్రజలు నిర్దారణకు వచ్చారని తెలిపారు. ఈ దశలో సీమాంధ్ర నేతలు ఏమి చేసినా కాంగ్రెస్‌ అధిష్టానం వెనుకంజవేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సీఎం కిరణ్‌ సహా సీమాంధ్ర నేతలంతా ఏకమై ఎన్ని కుట్రలు పన్నినా ఆత్మగౌరవం కోసం సాగించిన తెలంగాణ ఉద్యమం ఫలిస్తుందని చెప్పారు. ఆనాడు హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగానే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుపైనా సీమాంధ్రులు తప్పుడు భాష్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఏనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం కాదని దామోదర తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించే కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని ఆయన విశ్వసం వ్యక్తం చేశారు.