తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర అమోఘం
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, కోదండరామ్
హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర అమోఘమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఏవీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని, కేవలం భౌగోళిక విభజన కోసం మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతుందనే కారణంతో సదస్సుకు పోలీసులు అనుమతించకపోవడం సరికాదని ఆయన అన్నారు. న్యాయవాదుల వల్ల ఎమ్మెల్యేలకు ముప్పుందని పోలీసులు భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు సమాఖ్య స్ఫూర్తికి సంప్రదాయాలకు విరుద్ధమన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర పునర్వ్యస్థీకరణ కోసమే కాకుండా సీమాంధ్ర వలస పాలకుల నుంచి విముక్తి కోసం సాగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వలస పాలకులు, సామ్రాజ్యవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీమాంధ్రులకు కేవలం భూములు, సహజ వనరులపై మాత్రమే ఆధిపత్యం ప్రదర్శించడం లేదని, రాజకీయ, ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థల్లోనూ వారి ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే న్యాయవ్యవస్థ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందారు. సమాఖ్య వ్యవస్థలో దేశం ఉమ్మడిగా ఉంటుందని, రాష్ట్రాలు విభజించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు పార్టీలు, సంస్థల నాయకత్వ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్న వారంతా కుట్రదారులుగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పరోక్షంగా అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తున్నాడని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన అనేక ఉద్యమాల్లో న్యాయవాదులు ముందుండి కొట్లాడరని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టడం రోజుల్లో జరిగింది కాదని, నాలుగున్నర దశాబ్దాల పోరాటం దీనివెనుక దాగుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్, డైరీని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు, టీ లాయర్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.