భూదందాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే
రాజకీయ సన్యాసం: కేంద్ర మంత్రి సర్వే
హైదరాబాద్, జనవరి16 : తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఖండించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై భూదందా వార్తలు ప్రసారం చేసిన చానల్‌పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అలాగే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా తనకు అవకాశాలు ఉన్నాయని, ఆ అవకాశాలను తప్పించేందుకు కొంత నేతలతో కలిసి ఆ చానల్ కుట్ర పన్నిందని ఆరోపించారు. తాను భూ దందాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సర్వే సవాల్ విసిరారు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆ చానల్ తనపై ఆరోపణలు చేసే హక్కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కనీసం 60గజాల స్థలం లేదని, నిరుపేదనని ఇంకా భార్య జీతంపైనే ఆధారపడి జీవితం వెళ్లదీస్తున్నానని చెప్పారు. ఒక్కగజం ప్రభుత్వం లేదా ప్రైవేట్ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమని ఆయన సవాల్ విసిరారు. పేద, దళిత కుటుంబం నుంచి వచ్చానని, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తానన్న నమ్మకంతో తనకు సోనియా గాంధీ రాజకీయ పునర్జన్మ ఇచ్చారని, 13ఏళ్ల ఉద్యోగుల సర్వీసులో ఒక రూపాయి అవినీతికి పాల్పడలేదన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి దాదాపు 15ఏళ్ల పాటు రాజకీయ నిరుద్యోగిగా కొనసాగానని చెప్పారు. 1985లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 89వరకు కొనసాగినా.. ఆ తర్వాత ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదన్నారు. నీతి, నిబద్దతతో వెలిగే వ్యక్తినని భావించే సోనియాగాంధీ తనకు పార్లమెంట్ సీటు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. చాలా మంది బడాబాబులు తనను ఓడించారని ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. సోనియా తనకు తల్లిలాంటిదన్నారు. రాహుల్ ప్రధాని కావాలన్న కోరికతోనే ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. మీడియా తలచుకుంటే జీవితాలు బాగు చేయగలవని, లేదంటే పాడు చేయగలనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఐదులక్షల భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తనకు పడనివారే తిరిగి టిక్కెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఏఏ ప్రైవేట్ భూములను కబ్జా చేశానో ఆ చానల్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రకటించి సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఇవ్వదని కొన్ని పార్టీలు సోనియాకు చెడ్డపేరు వచ్చే విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపె అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఇక దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణ ఉద్యమానికి గౌరవం ఇవ్వాలని, ఆయన సీమాంధ్ర నేతలను కోరారు. రాష్ట్ర విడిపోయినంత మాత్రాన ప్రజలు విడిపోరని, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రపతి ముసాయిదా బిల్లును కేవలం సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి పంపించారని చెప్పారు. 294మంది సభ్యులు వద్దన్నా కేంద్రం తెలంగాణ ఇచ్చి తీరుతుందని చెప్పారు. ఎన్ని రోజులు చర్చ జరిగినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రావడం ఖాయమన్నారు.