మీతిమీరిన టిటిడి ఆగడాలు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 16 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులపై టిటిడి కేసులు పెట్టడాన్ని బిజెపి రాష్ట్రశాఖ తీవ్రంగా ఖండించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, భక్తులపై పెట్టిన కేసుల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భక్తులపట్ల భగవంతుడు అనుగ్రహం చూపుతున్నా టిటిడి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టిటిడి ఆగడాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ సూచనలను సైతం అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు టిటిడి నిర్వాకంవల్ల నిరుత్సాహానికి గురయ్యారని ఆయన విమర్శించారు. వివిఐపిలకు అడ్డూ అదుపులేకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు కల్పించిన టిటిడి, సామాన్య భక్తులకు మాత్రం నిరాశే మిగిల్చిందని అన్నారు. శ్రీవారి దర్శనం దక్కదేమోనన్న ఆందోళనలతో భక్తులు నిరసన తెలిపితే, టిటిడి అధికారులు వారిపై కేసులుపెట్టి తమ నైజాన్ని చాటుకున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న భక్తులు ఆవేదనకు గురై ఆందోళనలు చేపట్టారని ఆయన అన్నారు. వివిఐసిలకు ఇష్టమొచ్చిన రీతిలో పాసులు జారీ చేసిన అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏదేమైనా, టిటిడి బోర్డును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారం, డబ్బుకు టిటిడి దాసోసమవ్వడంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగడం లేదని ఆయన ఆరోపించారు. అధిక మొత్తంలో వివిఐపిల పాసులు జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌ నరసింహన్‌ జోక్యం చేసుకోవాలని సూచించారు.

నేటి నుండి జాతీయ కార్యవర్గ సమావేశాలు..

ఈనెల 17 నుండి మూడు రోజుల పాటు జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే బిజెపి గడప గడప ప్రచారం చేపడుతుందని అన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సాధారణ ఎన్నికల్లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయాయని అన్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేవిధంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీల పొత్తులపై ఇప్పుడే మాట్లాడబోమని అన్నారు. తెలంగాణ అంశాన్ని నీరుగార్చేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న అనుమానం ప్రజల్లో కలుగుతోందని కిషన్‌రెడ్డి అన్నారు.