తెలంగాణకు రాజముద్ర
త్వరలో అపాయింటెడ్ డే
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీ రాజముద్ర వేశారు. ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదే నెల 27న రాష్ట్రపతికి పంపింది. శనివారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాపై ప్రణబ్‌ముఖర్జీ సంతకం చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ఉనికిలోకి వచ్చే తేదీ (అపాయింటెడ్ డే)ని ప్రకటిస్తామని హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన దస్త్రం గవర్నర్‌కు చేరినప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది. రాష్ట్ర విభజనకు మార్చి 1 నోటిఫైడ్ డేట్‌గానున్నట్లు తెలిసింది. అలాగే ఆదివారం నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. సాధారణ ఎన్నికల అనంతరం జూన్ 1వ తేదీని అపాయింటెడ్ తేదీగా నిర్ణయించే అవకాశముందని ¬ంశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ రాష్ట్రపతి, గవర్నర్‌ల ద్వారా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి మండలి నిన్న సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి మండలి నిన్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో సమావేశమే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడ్డాక, కొత్త ప్రభుత్వం ఏర్పడే సమాయానికి జూన్ 1 లేదా 2న రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు కొలువు దీరే అవకాశముంది. అలాగే రాష్టంలో ప్రధాన కార్యదర్శి పదవిని కూడా జూన్ వరకు పొడగించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన అనంతర పక్రియపై ఇంకా కొంత కసరత్తు చేయాల్సి ఉన్నందున, ఆస్తులు, అప్పుల పంపకం కొనసాగుతున్నందున రెండు రాష్ట్రాలు వేరు కాపురం పెట్టడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడే నాటికి ఆవిర్భావ తేదీని నిర్ణయించే ఛాన్సు ఉంది. అయితే ఈ తేదీ ఎప్పడనేది గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనే ఛాన్స్ ఉంది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్ర కేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. దీంతో ఈరోజే నోటిఫైడ్ తేదీగా పరిగణనలోకి వస్తుంది. అంటే ఇవాల్టీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది. ఢిల్లీ నుంచి గవర్నర్‌కు సమాచారం అందగానే పాలనా పగ్గాలు ఆయన చేతిలోకి వస్తాయి. దీంతో సీఎం సహా మంత్రులందరూ మాజీలుగా మారారు. ఎమ్మెల్యేలకూ ఎలాంటి అధికారాలు ఉండవు. జీతాలు మాత్రం అందుతాయి. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంటుంది.ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈరోజు ఆమోదముద్ర వేశారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు కొద్దిరోజుల క్రితమే ఆమోదం తెలిపి రాష్ట్రపతి వద్దకు పంపాయి. దీనికి రాష్ట్రపతి ఈ రోజు ఆమోదముద్ర వేశారు.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సిఫార్సుకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయగా రాష్ట్రపతి దానికి ఆమోదం తెలిపారు. దీంతో ఆంధప్రదేశ్‌లో 1973 తర్వాత మరోసారి రాష్ట్రపతి పాలన అమలు కానుంది. రాష్ట్రపతిభవన్ నుంచి గవర్నర్‌కు ఉత్తర్వులు అందగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టిన సమయంలో సాధారణంగానే గవర్నర్ బాధ్యతలు పెరుగుతాయని సిక్కిం మాజీ గవర్నర్ రామారావు అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఎటువంటి ఆంక్షలు ఉండవని చెప్పారు. గవర్నర్‌కు పాలనలో సలహాలు ఇవ్వడానికి ఇద్దరు లేక ముగ్గురు సలహాదారులు ఉంటారని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తుది భాధ్యత గవర్నర్ కే ఉంటుందని తెలిపారు. ప్రధాన సమస్యలు గవర్నర్ వద్దకే తీసుకెళ్లాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల పక్రియ సక్రమంగా నిర్వహించేందుకు, విభజన పక్రియను సక్రమంగా, వేగవంతంగా చేసేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973 జనవరి 11 నుంచి 1973 డిసెంబరు 10 వరకు 11 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పటంతో అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రం ఇప్పటివరకు సుమారు 120 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది.